తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందంటూ… తొలి సారి ఓ టీడీపీ ప్రజాప్రతినిధి బహిరంగ ఆరోపణులు చేశారు. తెలంగాణ సర్కార్ తమ కంపెనీకి రూ. 300 కోట్లు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వడం లేదని చెబుతూ… నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణలో వ్యాపారాలున్న టీడీపీ నేతలను అక్కడి ప్రభుత్వం బెదిరిస్తోందని.. నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. తమ సంస్థకు.. తెలంగాణ ప్రభుత్వం నుంచి 300కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని.. ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. రాయపాటి ఆరోపించారు. ఎన్ని సార్లు అడిగినా స్పందన లేదని.. అందుకే కోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు.
ఆంధ్రా నేతలను బెదిరించి పార్టీలు మారని.. చెబుతున్నారని…. కేసీఆర్ ఒత్తిడి వల్లే కొంత మంది పార్టీలు మారారని రాయపాటి అంటున్నారు. కేసీఆర్ ను నమ్మకద్రోహిగా.. రాయపాటి అభివర్ణించారు. కేసీఆర్ బెదిరింపులకు లొంగబోమని… తీవ్ర స్వరంతో హెచ్చరించారు. జగన్కు చందాలు ఇవ్వాలని… ఫార్మా కంపెనీల యజమానులను కూడా బెదిరిస్తున్నారని.. రాయపాటి చెబుతున్నారు. మోడీ, కేసీఆర్, జగన్ కలిసినా.. చంద్రబాబును ఏమీ చేయలేరని.. ఏపీలో మళ్లీ టీడీపీనే గెలుస్తుందన్నారు. రాయపాటి ఆరోపణలు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఉద్యమ సమయంలో.. కేసీఆర్ రాయపాటిపై ఆరోపణలు చేశారు. రాయపాటి చైనా వెళ్తే మళ్లీ వెనక్కి రానీయరని ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాయపాటికి అలాంటి ఆరోపణలు చేసే చాన్స్ వచ్చింది.
ఇప్పటి వరకూ.. హైదరాబాద్ లో తమకు ఉన్న ఆస్తులను చూపించి.. బెదిరిస్తున్నారని.. ఏ టీడీపీ నేతా బయటకు చెప్పలేదు. టీడీపీ అధినేత మాత్రం.. బహిరంగసభల్లో చెబుతున్నారు . ఇప్పుడు తొలిసారిగా.. ఓ ఎంపీ బయటకు వచ్చారు. ట్రాన్స్ట్రాయ్ పేరుతో… కాంట్రాక్ట్ కంపెనీ రాయపాటి సాంబశివరావుకు ఉంది. ఆయన తన కంపెనీ తరపున తెలంగాణలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. దానికి సంబంధించిన నిధులపైనే ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అంత బలమైన ట్రాక్ రికార్డు లేదు. పోలవరం కాంట్రాక్ట్ విషయంలో చేతులెత్తేసి… విమర్శలు మూటగట్టుకున్నారు.