బాలకృష్ణ స్పీచుల్లో ఎప్పుడూ ఏదో ఓ వెరైటీ కనిపిస్తుంటుంది. అందుకే ఆయన మైకు ఎప్పుడు పట్టుకున్నా కావల్సినంత ఫన్ దొరికేస్తుంటుంది. కొన్ని పేర్లు తప్పుగా పలకడమో, టైటిళ్లని మార్చేయడమో బాలయ్యకు అలవాటు. `118` ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ అదే జరిగింది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మార్చి 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు అతిథులుగా వచ్చారు. బాలయ్య తన ప్రసంగంలో ఈ సినిమా పేరుని తప్పుగా ఉచ్ఛరించారు. `189` అంటూ మార్చేశారు. ఒకసారి కాదు.. పదే పదే ఇదే జరిగింది. అయితే సర్దిచెప్పడానికి ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. కల్యాణ్ రామ్‌లో తపన ఉందని, ఆ తపనతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ని స్థాపించి కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడని మెచ్చుకున్నారు బాలయ్య. ఈ టైటిల్ వింటే, కథేంటో చెప్పలేకపోతున్నామని, అయితే యువతరానికి నచ్చేలా ఉందని, ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని ఆభాభావం వ్యక్తం చేశారు.
కథానాయకుడు, మహానాయకుడు.. ఇలా వరుసగా రెండు ఫ్లాపులు రావడం వల్లేమో.. బాలయ్య స్పీచులో ఇది వరకటి ఉత్సాహం కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ కూడా డల్‌గా కనిపించాడు. తన స్పీచ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సినిమా చూశానని, అన్నయ్య కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా మిగిలిపోతుందని, ముఖ్యంగా నివేదా థామస్ నటన కన్నీరు తెప్పించిందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ . స్పీచులు ఎలాగున్నా.. నందమూరి హీరోలు ముగ్గురినీ ఒకే వేదికపై చూడడం మాత్రం నందమూరి అభిమానులకు పండుగలా అనిపించింది.