ప్రతిపక్ష పార్టీ వైకాపా పత్రికలో వచ్చే కొన్ని కథనాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది! ఆంధ్రాలో ప్రభుత్వానికి బదులు, ఏదో మాఫియా డెన్ నడుస్తోందన్నట్టుగా వారి రాతలు ఉంటున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఏ వ్యవస్థపైనా వారికి నమ్మకం లేదన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఈ స్థాయి పరిస్థితులు ఉంటే… ప్రజలు ఎందుకు భరిస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలకు అధికార పార్టీ టీడీపీ పాల్పడుతోందని చాన్నాళ్ల నుంచి వైకాపా ఆరోపిస్తోంది. తమ పార్టీ మద్దతుదారుల ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారనీ, టీడీపీ మద్దతుదారులు, రౌడీల ఓట్లను చేర్పిస్తున్నారనేది ఆ పార్టీ ఆరోపణ. ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి కూడా ఇదే అంశమై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేసి వచ్చారు. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా ఇవాళ్టి సాక్షిలో ‘ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు’ అంటూ ఒక కథనం రాశారు.
సర్వేల ముసుగులో టీడీపీ బృందాలు ఊళ్లలోకి వెళ్తున్నాయనీ, ప్రజల దగ్గర వివరాలు తీసుకుంటున్నాయనీ, వారు జగన్ కి మద్దతుదారులు అని తెలియగానే… వారి మొబైల్ నంబర్లు తీసుకుని, వారి ఓట్లను జాబితా నుంచి డిలీట్ చేస్తున్నాయని సాక్షి చెప్పింది. వైకాపా పట్టున్న ప్రాంతాల్లో నకిలీ బృందాలు ఎక్కువగా తిరుగుతున్నాయనీ, ప్రతీ బృందానికి ఒక్కో టీడీపీ నాయకుడు వెన్నుదన్నుగా ఉంటున్నారని రాసింది. మరి, ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటే… వారు కూడా టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని సాక్షి ఆరోపించేసింది. మరి, ఇంత జరుగుతుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నట్టు అంటే… వారికి ఫిర్యాదులు చేస్తున్నా స్పందించడం లేదని సాక్షి రాసేసింది.
వాస్తవానికి ఎన్నికల ముందు జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియను ఎన్నికల సంఘం చేపడుతుంది. కొత్త ఓటర్ల నమోదుకు సమయం ఇస్తుంది. ప్రతీ ఓటరూ తన పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు… సాక్షికి ఎందుకంత ఆందోళన..? ఈసీకి ఫిర్యాదు చేసినా ఆగడం లేదు, పోలీసులు కూడా ఈ అక్రమాలకు తోడు నిలుస్తున్నారని ఆరోపించడం ఎంతవరకూ సరైంది..? తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలానే ఎన్నికల ముందు హడావుడి చేసింది. ఓటర్ల జాబితాలో తమ మద్దతుదారుల పేర్లను తొలగించారంటూ కోర్టు దాకా వెళ్లింది. కానీ, చివరికి ఏమైంది..? ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇలాంటి అనుమానాలుంటే ప్రజలను చైతన్యవంతం చెయ్యాలి. ఓటర్ల జాబితాలో మీ వివరాలను సరిచూసుకోండని ఒక పత్రికగా చెప్పాలి. అంతేగానీ, వారిలో ఉన్న ఆందోళనను బయటపెట్టుకోవడం కోసం ఇలాంటి కథనాలను రాస్తూ, ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, ఎన్నికల సంఘాన్ని… ఇలా ఎవర్నీ నమ్మమంటే వారిని ఏమనుకోవాలి..?