ఒక విచిత్రమైన ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. తనది ఆంధ్రా అని చెప్పుకుని తిరిగుతారే తప్ప, సొంత రాష్ట్రానికి ఉపయోగపడేలా ఆయన ఇంతవరకూ చేసిందేం లేదనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తాజా ప్రతిపాదన కూడా అందుకు భిన్నమైంది అంతకన్నా కాదు! ఇంతకీ ఆయన ఏమంటారంటే… ఆంధ్రాలో ఒక కమిటీ వేద్దామంటారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. ఇంతకీ దేనిమీద ఆ కమిటీ అంటే… ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతి, కుల రాజకీయాలపైన!
రాష్ట్రంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలనీ, ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు పత్రికలు కూడా ఈ కమిటీలో ఉండాలన్నారు జీవీఎల్. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం, ఆంధ్రాలో చేసిన అభివృద్ధి ఏంటనేది ముందుగా ప్రజలకు చెప్పి… ఆ తరువాత టీడీపీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. చేసిన అభివృద్ధి ఏంటో సీఎం చంద్రబాబు చెప్పిన తరువాతే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలన్నారు. కేవలం రాజకీయ విమర్శలు చేస్తూనే ఆయన పబ్బం గడుపుతున్నారనీ, కేంద్రం ఇస్తున్న పథకాలకు తన స్టిక్కర్ అతికించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దేశ భద్రతపై దాడి జరుగుతుంటే పాక్ ప్రధానికి వంతపాడేలా చంద్రబాబు మాట్లాడారు అంటూ జీవీఎల్ మరోసారి ఆరోపించారు. ఇక, రాష్ట్రంలో పాలన అంతా అవినీతిమయం అంటూ రొటీన్ విమర్శలు ఆయన చేశారు.
సరే, జీవీఎల్ అంటున్న కమిటీ ప్రాక్టికల్ గా సాధ్యమా..? ఒకవేళ సాధ్యమైనా దాని వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం..? అలాంటి ఒక కమిటీ వెయ్యకముందే… అది ఇవ్వబోయే రిపోర్టు కూడా జీవీఎల్ చెప్పేస్తున్నారు కదా! రాష్ట్రంలో అవినీతి, కులరాజకీయాలు పెచ్చరిల్లుతున్నాయని ఆయనే అనేస్తున్నారు. వాస్తవానికి, ఇలాంటి కమిటీల కంటే… ఆంధ్రాకి కేంద్రం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు జరిగాయో జీవీఎల్ తేల్చితే బాగుంటుంది. కేంద్ర పథకాలకే ఏపీ సర్కారు స్టిక్కర్లు అతికిస్తోందని అంటున్నారు కదా! దానిపై కూడా కమిటీ వేసి… ఏయే పథకాలు కేంద్రం ఇస్తోందో కూడా చెప్పొచ్చు. పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణ నిధులు, రెవెన్యూలోటు భర్తీ నిధులు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు… ఇవన్నీ ఎక్కడున్నాయో నిజాలు తేల్చే కమిటీ వేస్తే బాగుంటుంది. ఇవన్నీ తేల్చాక… ఆ తరువాత ఏపీకి వచ్చి జీవీఎల్ విమర్శలు చేసినా కొంత అర్థవంతంగా ఉంటుంది. అంతేగానీ, ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏం ఉపయోగం..?