బిగ్ బాస్ 2లో కౌశల్ ని విజేతగా నిలపడానికి కౌశల్ ఆర్మీ ఎంతగానో కష్టపడింది. కౌశల్ బయటకు రాగానే ర్యాలీలూ సన్మానాలూ చేసింది. కౌశల్ విదేశాలకూ వెళ్లి, అక్కడ అభిమానుల్ని సృష్టించుకున్నాడు. మరోవైపు హీరోగా అవకాశాలొస్తున్నాయి. రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. ఈలోగా కౌశల్ ఆర్మీ బాంబు పేల్చింది. ఎవరైతే కౌశల్‌ని బిగ్ బాస్ విజేతగా నిలిపారో, వాళ్లే ఇప్పుడు కౌశల్ బాగోతాలు బయటపెట్టారు. కౌశల్ మోసగాడని తేల్చేశారు. టీవీ 5 మూర్తి సాక్షిగా.. కౌశల్ నిజ స్వరూపం చూపించేశారు. కౌశల్‌పై వచ్చిన ఆరోపణల్లో హైలెట్స్ ఇవే.
* కౌశల్ ఆర్మీని కౌశల్ సెంటిమెంటల్ ఫూల్స్ చేసి ఆడుకున్నాడు. తాను బిగ్ బాస్ 2లో విజేత అయిన తరవాత.. కౌశల్ ఆర్మీని గానీ, తనకు సపోర్ట్ చేసినవాళ్లని గానీ కౌశల్ పట్టించుకోలేదు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా.. గ్రూపుల్లో వాళ్లనీ, వాళ్ల కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయడానికి కొంతమందిని ప్రత్యేకంగా నియమించాడు కౌశల్.
* బిగ్ బాస్ లో గెలిచిన 50 లక్షల్ని కౌశల్ కాన్సర్ బాధితుల సహాయార్థం అందిస్తానని మాటిచ్చాడు. అయితే ఇంత వరకూ ఆ డబ్బులు ఏం చేశాడో చెప్పలేదు. అడిగితే… మా టీవీ వాళ్లు ఇంకా ఇవ్వలేదని చెబుతున్నాడు. మరీ గట్టిగా అడిగితే.. `మీకెందుకు? నా డబ్బులు నా ఇష్టం..` అని దబాయిస్తున్నాడు.
* కౌశల్ ఆర్మీలో లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్లంతా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్‌కి లక్షల్లో డొనేషన్లు ఇచ్చారు. నెలకు కనీసం 5 వందల నుంచి ఎంతైనా ఇవ్వొచ్చన్నది నియమం. అలా పోగైన డబ్బులు కౌశల్ ఏం చేశాడో చెప్పాలి.
* కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం ఓ అమ్మాయి 30 వేలు పోగేసింది. ఆ చెక్కి కౌశల్‌కి ఇవ్వబోతే… `నా పేరు చెబితే కనీసం 5 లక్షలు రావాలి.. ఆఫ్ట్రాల్ 30 వేలేంటి?` అంటూ అడిగాడు.
* కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కోసం గోవాలో ఓ కార్యక్రమం జరిగింది. అక్కడ కౌశల్ కొంతమందికి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ ద్వారా వచ్చినా ఆదాయంతో ఏదైనా మంచి పని చేయాలన్నది లక్ష్యం. కానీ ఆ పార్టీలో మద్యం ఏరులై పారింది. జల్సాల రూపంలో ఎక్కుడ డబ్బులు వృధా చేశారు. లక్ష్యం దెబ్బతింది.
* ఫ్యాన్స్ ఏవైనా కార్యక్రమాలు నిర్వహించి, దానికి కౌశల్ ని పిలిచినా డబ్బులు కట్టాల్సిందే. విమాన ప్రయాణం, బస.. ఇవన్నీ ఫ్యాన్స్ చూసుకోవాల్సిందే. కౌశల్ అడుగుపెట్టిన ప్రతీ కార్యక్రమానికీ పారితోషికం రూపంలో పెద్ద మొత్తం వసూలు చేశాడు.
* ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కౌశల్‌కి ఫోన్ రావడం, అభినందనలు అందడం కేవలం నాటకం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, డాక్టరేటు కూడా అబద్ధాలే.
* కౌశల్ గెలవడానికి ఆర్మీ సభ్యులంతా దొంగ ఐడీలు సృష్టించారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా 500 ఈమెయిల్ ఐడీలు సృష్టించి ఓటింగ్ వేశాడు.
* కౌశల్ రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేశాడు. ప్రత్యేకంగా ఓ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. డొనేషన్లను ఫ్యాన్స్ నుంచి రాబట్టాలన్నది ప్లాన్. కానీ కౌశల్ ఆర్మీ దానికి అభ్యంతరం చెప్పడంతో ఆ ప్లాన్ పక్కన పెట్టాడు.
* కౌశల్ ఆర్మీ నిజాయితీగా కౌశల్ కోసం పని చేసింది. అయితే కౌశల్ కి మరో పెయిడ్ ఆర్మీ కూడా ఉంది. వీళ్ల పనేంటంటే.. కౌశల్ కోసం ఎవరైనా నెగిటీవ్‌గా మాట్లాడితే వాళ్లని ట్రోల్ చేయడం. ఫోన్లు చేసి బెదిరించడం.
– కౌశల్ ఆర్మీలో కీలక సభ్యులైన వాళ్లంతా చేసిన ఆరోపణలు ఇవి. ఒకప్పుడు వీళ్లే కౌశల్ గొప్పవాడని మీడియా ముందుకొచ్చి లెక్చర్లు దంచారు. కౌశల్‌పై వచ్చిన నిందలన్నింటినీ కడిగి పారేశారు. ఇప్పుడు వాళ్లే కౌశల్ పై వార్ ప్రకటించారు. మరి వీటికి కౌశల్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.