ఒక్క సినిమాకే ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి. సినిమా హిట్టయితే అడ్వాన్సులతో క్యూలు కట్టినవాళ్లే, ఫ్లాప్ అయితే ఆ అడ్వాన్సులు వెనక్కి ఇవ్వమని గోల చేస్తుంటారు. సరిగ్గా బోయపాటి శ్రీను విషయంలో ఇదే సీన్ జరిగింది. ‘వినయ విధేయ రామ’తో బోయపాటి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ మాట అటుంచితే – నిర్మాతలతో గొడవ జరగడం, ఇద్దరూ బాహా బాహీకి దిగడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. బోయపాటితో తేడా వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఉదంతం ఒకటి ఉదాహరణగా నిలిచిపోయింది.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం బోయపాటి కాస్త తగ్గి ఉండక తప్పడం లేదు. మరోవైపు ఇది వరకు తీసుకున్న అడ్వాన్సులు గుదిబండలా చుట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీస్‌తో ఓ సినిమా చేయడానికి బోయపాటి ఇది వరకే అడ్వాన్సు తీసుకున్నాడు. సరైనోడు సమయంలోనే మైత్రీ అడ్వాన్సు అందింది. ఇప్పటి వరకూ మైత్రీతో సినిమా చేయలేకపోయాడు బోయపాటి. అయితే మైత్రీ అడ్వాన్సు విషయంలో కంగారేం పెట్టలేదు. ‘బోయపాటి ఎప్పుడు చేసినా ఓకే’ అన్న ధీమాతో ఉంది. అయితే ఎప్పుడైతే ‘వినయ విధేయ రామ’లాంటి సినిమా వచ్చిందో, అప్పుడు మైత్రీ కూడా జాగ్రత్త పడిపోయిందని టాక్. అయితే నేరుగా మా అడ్వాన్స్ మాటేంటి? అని అడక్కుండా, ‘మా సినిమా మాటేంటి?’ అంటూ పరోక్షంగా అడ్వాన్సు సంగతి గుర్తు చేస్తుండడంతో బోయపాటి ఆ అడ్వాన్సుని వెనక్కి తిరిగి ఇచ్చేసి, ఎగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అయితే గీతా ఆర్ట్స్ అడ్వాన్స్ కూడా బోయపాటి చేతిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గీతా ఆర్ట్స్‌తో బోయపాటి సినిమా చేయడం దాదాపు అసంభవం. మరి ఆ అడ్వాన్స్ మాటేం చేశాడో…??