హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కులంపై విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటకొచ్చాయని, తనవద్ద ఉన్న సమాచారంమేరకు అతను దళితుడు కాదని చెప్పారు. అతనిని దళితుడని ప్రచారం చేయటం ద్వారా కొందరు దీనిని కుల వివాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రచారసభలో మాట్లాడుతూ, విపక్షాల నీచరాజకీయాలవల్ల రోహిత్ ఆత్మ రోదిస్తుందని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు నీచరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి వాజ్‌పేయి ఆద్యుడని, చంద్రబాబు బాధ్యుడని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఎవరూ సెటిలర్లు కారని, అందరూ భారతీయులే అని వెంకయ్య నాయుడు అన్నారు. ఐసిస్ సానుభూతిపరులు తమపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందంటూ పరోక్షంగా మజ్లిస్‌పై విమర్శలు గుప్పించారు.