ఎన్టీఆర్ బయోపిక్కు నుంచి రెండు భాగాలూ వచ్చి వెళ్లిపోయాయి. అవేం.. సగటు ప్రేక్షకుడిలో అలజడిని కలిగించలేకపోయాయి. అయితే… ఇప్పుడు అసలు సిసలైన బయోపిక్ వస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపంలో. ఓ విధంగా చూస్తే.. ఎన్టీఆర్ బయోపిక్‌కి మూడో భాగం ఇది. అటు కథానాయకుడులోనూ, ఇటు మహానాయకుడులోనూ లేని, చూపించలేని, చూపించడానికి అంత ధైర్యం చేయలేని సన్నివేశాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఉంటాయని సినీ ప్రేక్షకుల ఆశ.
రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు మారుపేరు. ఏం చూపిస్తే జనం ఎగబడతారో, దేని గురించి మాట్లాడుకుంటారో, ఏది సంచలనం సృష్టిస్తుందో బాగా ఎరుక. అందుకే ఏరి కోరి ఎన్టీఆర్ జీవితంలోని చమరాంకం చూపించాలని డిసైడ్ అయ్యాడు. లక్ష్మీ పార్వతి వచ్చినప్పటి నుంచీ.. ఎన్టీఆర్ మరణం వరకూ.. ఈ కథ సాగబోతోంది. అసలు సిసలైన డ్రామా అంతా ఈ ఎపిసోడ్‌లోనే ఉంది. ప్రస్తుత రాజకీయాలపై, రాబోతున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై.. ప్రభావం చూపించేంత స్టఫ్ ఈ సినిమాలో ఉన్నా, లేకపోయినా.. – విడుదలకు ముందు కొన్ని వివాదాలు తప్పేట్టు లేవు. మరీ ముఖ్యంగా.. సెన్సార్ గండాన్ని ఈ సినిమా గట్టెక్కుతుందా? అనేదే ప్రశ్న.
ఇది ఓ వ్యక్తి జీవిత కథ. ఎన్టీఆర్ పేరుని ప్రత్యక్షంగానే వాడేస్తున్నాడు వర్మ. చంద్రబాబుని పోలిన పాత్రలు చూపిస్తున్నాడు. ఇవన్నీ.. ఈ సినిమా విడుదలకు స్పీడు బ్రేకర్లుగా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవరైనా సరే ఈ సినిమా విడుదల అడ్డుకునే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ మాట్లాడకపోయినా… విడుదలకు ముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోకాలడ్డే ప్రమాదం ఉంది. ‘మా అనుమతి లేకుండా.. ఎన్టీఆర్ జీవిత కథని ఎలా చూపిస్తారు?’ అని అడిగితే వర్మ దగ్గర సమాధానం ఉంటుందా? వర్మ ఏదో ప్రయాస పడుతున్నాడు గానీ.. ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సే లేదన్న మాట పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. వర్మకు కావాల్సింది కాంట్రవర్సీనే. ఈసినిమా విడుదలను అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తే… తనకు మరింత ప్లస్ అవుతుంది. ‘పోయి పోయి వర్మతో పెట్టుకోవడం ఎందుకులే.. ‘ అనుకుంటే తప్ప – లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని ఎవ్వరూ అడ్డుకోకపోవొచ్చు. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకూ.. వర్మని ఎవరైనా కెలక్కుండా ఉంటారా?? అంత సహనం ఉందా?? చూడాల్సిందే.