హైదరాబాద్: తూర్పుగోదావరిజిల్లా తునిలో కాపు గర్జన పేరుతో మహాసభను తలపెట్టిన కాపు నేతలు సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. రాజస్థాన్లోని గుజ్జర్ల తరహాలో ఉన్నట్లుండి రోడ్ రోకో, రైల్ రోకోకు దిగారు. గర్జన సభను ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం ఆ సభలో కొంతసేపు ప్రసంగించిన తర్వాత తన నిర్ణయాన్ని ఉన్నట్లుండి ప్రకటించారు. రోడ్లపైకి, పట్టాలపైకి వెళదామని, కాపులను బీసీల్లో చేర్చేవరకు ఇళ్ళకు తిరిగివెళ్ళేది లేదని చెప్పారు. ఇలా ఆకస్మిక నిర్ణయం తీసుకున్నందుకు సభావేదికపైన ఉన్న ఇతర కాపు ప్రముఖులు క్షమించాలని అడిగారు. వారి అంగీకారాన్ని, సభికుల అంగీకారాన్ని తీసుకుని సభావేదికపైనుంచి దిగి పక్కనే ఉన్న కొల్కతా – చెన్నై జాతీయరహదారిపైకి వెళ్ళి ఒక వాహనంపై బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ పరిణామం చేటుచేసుకుంది. పక్కనే ఉన్న రైలుపట్టాలపైకి కూడా కాపు కార్యకర్తలు చేరుకుని దిగ్బంధనం చేశారు. తుని స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉండటంతో పోలీసులు, అధికారులకు వారిని చెదరగొట్టే పరిస్థితి కనిపించటంలేదు. అక్కడయితే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి. కాపు కార్యకర్తలు దిగ్బంధం చేసిన హైవేగానీ, రైల్వే లైన్ గానీ కీలక మార్గాలు కావటంతో రవాణా కార్యకలాపాలు తీవ్రంగా స్తంభించే అవకాశాలు కనబడుతున్నాయి.
అంతకుముందు ముద్రగడ కాపుగర్జన సభా వేదికపై మాట్లాడుతూ, విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఓ నంబర్ 30 అమలు కాలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు కోర్టులో పిటిషన్ వేయించి రిజర్వేషన్ను అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు తనను అడిగారని, ఆయనకు గుర్తు లేదేమోనని, తాను రిజర్వేషన్లకోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. చంద్రబాబు ఇప్పుడు కూడా ఈ కాపు గర్జన సభను జరగనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను కాపులకు ఇవ్వనీయకుండా చేశారని, వంట చేసుకోవటానికి జాగా ఇవ్వనీయలేదని ఆరోపించారు. తాను, తన కుటుంబం ఉద్యమానికి ముందే ఉంటుందని, మీరు వస్తారా అని సభకు వచ్చినవారిని అడిగారు. వస్తే రిజర్వేషన్ జీఓ విడుదలయ్యేవరకు ఇళ్ళకు వెళ్ళకూడదని రోడ్ రోకో, రైల్ రోకో చేస్తూనే ఉండాలని చెప్పారు. సభలోనివారు వస్తామని వారు చెప్పిన తర్వాత ముద్రగడ సభావేదిక దిగి హైవేపై చేరుకున్నారు. మరోవైపు ఈ సభకు కాపు రాజకీయ నాయకులు పళ్ళంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, గంగాభవాని తదితరులు హాజరయ్యారు. అయితే వారెవరికీ కూడా ముద్రగడ తీసుకున్న నిర్ణయం గురించి ముందుగా తెలిసినట్లు కనబడటంలేదు.