ఆంధ్రప్రదేశ్ రాజకీయం రాను రాను.. ఉద్రిక్తంగా మారుతోంది. ఓటర్ల జాబితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత…అన్ని పార్టీల్లోని నేతలు… సరి చూసుకోవడం ప్రారంభించారు. అన్నీ బాగున్నా కానీ.. వారికి ఓ సందేహం మాత్రం వచ్చింది. అదేమిటంటే… ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం… ఐదు నుంచి పది వేల ఓట్ల వరకూ.. తొలగించాలని ఇతరులు దరఖాస్తు చేయడం. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ.. ఓట్లను తొలగించాలని దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే.. మీ పని అంటే.. మీ పని అని టీడీపీ, వైసీపీ ఈసీని కలిసి ఫిర్యాదు చేశాయి. తెలుగుదేశం పార్టీ తరపున పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు చేయగా.. కాసేపటికే… చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వచ్చారు. ఈసీకి.. సేమ్ టు సేమ్ ఫిర్యాదులు చేసారు.
చంద్రగిరిలో 22 వేల వైసీపీ ఓట్లను తొలగించాలని దరఖాస్తులు చేశారని చెవిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప.గో జిల్లాలో 90 వేల ఓట్లను తొలగించమని దరఖాస్తులు ఇచ్చారని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురంలో 6వేల ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేశారని ఆరోపించారు. పర్చూరు నియోజకవర్గంలో ఏడు వేల ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇలాంటి ధరఖాస్తులు లక్షల్లో రావడంతో.. కలెక్టర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో కొన్ని ఐటీ సంస్థలతో ఒప్పందం చేసుకుని.. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ముందేసుకుని… ఓటర్లను తొలగించాలనే ధరఖాస్తులను… ఆన్లైన్ ద్వారా పంపుతున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. కావాలని చేయకపోతే.. ఇన్ని లక్షల దరఖాస్తులు రావని.. అంటున్నారు. దీనిపై విచారణ జరిపి… ఐపీ అడ్రస్ల ద్వారా కనిపెట్టి.. తక్షణం బాధ్యతలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ టీడీపీ వైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది.
అర్హులైన కొత్త ఓట్ల నమోదు కోసం ఫామ్ 6 ఉంటుంది. కానీ.. ఇతరులకు కూడా.. ఓటు తొలగించాలనే.. విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఫామ్ 7 ద్వారా ఉంటుంది. ఫలానా ఓటర్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఇతరులు.., ఈసీకి ఈ ఫామ్ 7 ద్వారా ఆన్లైన్లో ధరఖాస్తు చేయవచ్చు. ధరఖాస్తులో తప్పుడు వివరాలిచ్చినా పట్టించుకోరు. ఇలా వచ్చిన ధరఖాస్తులపై సహజంగా విచారణ జరిపి… తొలగింపు కార్యక్రమం చేపడతారు. ఇప్పటి వరుక ఎన్ని ఓట్లను తొలగించారో.. దీనిపై క్లారిటీ లేదు కానీ… ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో..దరఖాస్తులు రావడం మాత్రం కలకలం రేపుతోంది. తెలంగాణలో ఇదే పద్దతిలో వ్యవహరించబట్టే… 20 లక్షలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీలోనూ అదే పద్దతి వస్తుందా.. అన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.