కర్నూలు జిల్లా టీడీపీలోకి భారీ వలసలు ప్రారంభం అయ్యాయి. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనుంది. కోడుమూరు బల ప్రదర్శనగా భారీ సభ ఏర్పాటు చేసి మరీ .. కోట్ల టీడీపీలో చేరుతున్నారు. గౌరు దంపతులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. కోట్ల, గౌరు కుటుంబాలు టీడీపీలో చేరేందుకు సిద్దం కావడం జిల్లా రాజకీయ చరిత్రలోనే ఊహించని పరిణామలు. కోట్ల కుటుంబం గాంధీ ఫ్యామిలీతో ఆరు దశాబ్దాలకు పైగా, గౌరు ఫ్యామిలీ రెండు దశాబ్దాల కాలం పాటు వైయస్సార్ కుటుంబానికి ఆత్మీయులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని కాదనుకొని కోట్ల, గౌరు కుటుంబాలు చంద్రబాబు చెంతకు చేరుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరుంది. 1994 కర్నూలు లోకసభ ఉప ఎన్నికల్లో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేసి గెలిచారు. తర్వాత 2004,2009లో కూడా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆయన కొంత కాలం కిందటి వరకు పార్టీని వీడలేదు. ఇప్పుడు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీకి దాదాపు రెండు దశాబ్దాలుగా గౌరు దంపతులు వీర విధేయులుగా ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరూ వైయస్ అడుగు జాడల్లోనే నడిచారు. అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు… పార్టీలో క్లిష్ట పరిస్ధితులు ఏర్పడిన సమయంలో గౌరు వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీ శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుల్లా పనిచేస్తున్న గౌరు దంపతులకు టిక్కెట్ లేదని చెప్పారు జగన్. దాంతో వారు మనస్తాపానికి గురై వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల తొమ్మిదో తేదిన గౌరు వెంకట రెడ్డి, గౌరు చరితా టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
2014 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్ధానాలే టీడీపీకి దక్కడంతో చంద్రబాబు… అసంతృప్తికి గురయ్యారు. అక్కడ ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. చేరికలతో మాత్రమే కాదు.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు. ముందుగానే టిక్కెట్లపై క్లారిటీ ఇస్తున్నారు. రాయలసీమ వాసుల కలగా ఉన్న గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి, ఎల్లెల్సీ బైపాస్ పైప్ లైన్ ప్రాజెక్టుల నిర్మాణానికి జీవోలు జారీ చేశారు. వాటికి నిధులు కూడా విడుదల చేశారు. ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్దమయ్యారు. అటు రాజకీయంగా.. ఇటు అభివృద్ధి పనుల ప్రకారం కూడా… టీడీపీకి… కర్నూలు జిల్లాలో ఈ సారి అడ్వాంటేజ్ కనిపిస్తోంది.