తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఐదు స్థానాలకు ఆరుగురు బరిలో ఉన్నారు. ప్రస్తుత పార్టీల బలం ప్రకారం టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కాల్సి ఉంది. అధికార టీఆరెస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ పెట్టడంతో పాటు , మిత్రపక్ష పార్టీ ఎంఐఎంను రంగంలోకి దింపారు. ఐదవ స్థానం గెలిచే సంఖ్యా బలం లేకపోయినా.. టీఆర్ఎస్ పోటీ పెట్టడంతో.. కాంగ్రెస్‌లో కలవరం ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు 19 మంది మిత్రపక్షమైన టీడీపీ ఎమ్మెల్యే ల తో 21 సంఖ్య బలం హస్తం పార్టీ అభ్యర్ధికి ఉంది. కానీ టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్‌గేమ్‌తో అసలు ఎంత మంది ఎమ్మెల్యేలు తమతో ఉంటారా అన్న క్లారిటీ లేదు.
ఎమ్మెల్యేలను కాపాడుకుంటే తప్ప ఎమ్మెల్సీ సీటు రాదని క్లారిటీ ఉండటంతో… ఆర్థికంగా బలంగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో… గూడూరు నారాయణరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆయన ఎమ్మెల్యేలందర్నీ సంతృప్తి పరచగలరన్న నమ్మకంతో.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలనూ.. ఆయన టీఆర్ఎస్ నుంచి కాపాడుకోవాల్సి ఉంది. డీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓటింగ్ లో పాల్గొంటారా..? పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా అన్నది సందేహంగా మారింది. సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే.. టీఆర్ఎస్ను పొగుడుతున్నారు. ఓ సారి సీఎంను కలసి వచ్చారు. ఆయన కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేస్తారని చెబుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం చివరి నిమిషంలో ఏమైనా హ్యాండ్ ఇస్తారనే మైండ్ గేమ్ టీఆర్ఎస్ వైపు నుంచి వస్తోంది. అందుకే.. ఎమ్మెల్యేలందర్నీ క్యాంప్‌నకు తరలించాలనే ఆలోచన చేస్తున్నారు.
పన్నెండో తేదీన ఓటింగ్ జరగనుంది. అప్పటి వరకూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను క్యాంప్‌నకు తీసుకెళ్లాలని.. దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై హైకమాండ్‌తో కూడా మాట్లాడారు. అయితే ఎంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్యాంప్ కు వస్తారన్నది సందేహంగా మారింది. ఉన్నది కొంత మందే కాబట్టి… మమ్మల్నే అనుమానిస్తారా.. అని.. సెంటిమెంట్ అస్త్రంతో డుమ్మాకొట్టే సూచనలే ఉన్నాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ అనుసరించే వ్యూహాలు చూస్తే.. కాంగ్రెస్‌కు ఆ ఒక్క సీటు దక్కడం అంత తేలికైన విషయం కాదని చెబుతున్నారు.