కాపులను బిసిలుగా చేర్చాలన్న ఉద్యమాన్ని వెనక్కి వెళ్ళనీయకుండా ముద్రగడ పద్మనాభం లాక్ వేశారు. రిజర్వేషన్ పై ప్రభుత్వం జిఓ జారీ చేసేవరకూ రోడ్డుమీదో, రైలు పట్టాల మీదో వుందాం! నేనూ నా కుటుంబం ఇక్కడినుంచి ఇంటికి వెళ్ళదు…రోడ్డుమీదికే…మీరూ రండి అని సభాముఖంగా పిలుపు ఇచ్చారు.
దీంతో తునివద్ద రైలు, రోడ్డు దిగ్భంధనం ఆకస్మికంగా మొదలైంది. ఇది మాస్ మిలిటెన్సీకి, ఉద్రిక్తతలకు దారితీసే పరిస్ధితి వుంది. ముద్రగడ డిమాండ్ ప్రకారం తక్షణం జివో విడుదల అయ్యే పరిస్ధితులు సాంకేతికంగా లేవు. ఏ తాళానికి తలుపు తెరుచుకుంటుందో తెలియని స్ధితిలో తలుపు వెనుక ఎన్ని గంటలు, ఎన్నిరోజులు వేచివుండాలో ఆందోళనకారుల అంచనాకు అందని స్ధితి తలెత్తింది.
కాపు ఐక్యగర్జనలో ఉద్యమకార్యాచరణను ప్రకటిస్తామన్న ముద్రగడ పద్మనాభం కార్యాచరణను ఆకస్మికంగా మొదలు పెట్టేయడం టివిలు చూస్తున్న అధిపార పక్షం పెద్దలకంటే సభకు తరలి వచ్చిన కాపు నాయకులకు, వేర్వేరు రాజకీయ పార్టీల్లోని కాపు ప్రముఖులకు పెద్ద షాక్ ఇచ్చాయి.
కార్యక్రమాన్ని రూపొందించి, సిద్ధమై వచ్చిన ముద్రగడ ఎన్నిరోజులైనా రోడ్డు మీదా, రైలు పట్టాలమీదే వుందాం మీరూ రండి అని అందరికీ విజ్ఞప్తి చేయడం ఉద్యమానికి సిద్ధం కాకుండా వచ్చిన ఇతర నాయకులకు సంకటంగా పరిణమించింది. ఏ ప్రిపరేషన్ లేని వారు రోడ్డు మీద వుండలేరు,వెళ్ళిపోనూలేరు.
ముద్రగడ కార్యాచరణలో కార్యాచరణలో మొండితనం ఇలాగే వుంటుంది. స్పష్టమైన హామీ వచ్చేదాకా ఆయన పోరాటం ఆగదు. నిరాహారదీక్షలైనా అంతే…తుపాకితో గదిలో కూర్చుని బలవంతంగా తలుపు తీస్తే కాల్చుకుంటానన్న హెచ్చరికా అంతే…ఇపుడు వేలాదిమందితో జాతీయరహదారి మీద ఆగిపోవడమంటే ట్రాఫిక్ క్లియర్ చెయ్యాడానికి పోలీసుల ప్రవేశం అనివార్యమౌతుంది. ఇది ఉద్రిక్తతలను పెంచుతుంది.
ఈ ఉద్యమంపై తెలుగుదేశంలో వున్న కాపునాయకులు స్పందించడం లేదు. ముద్రగడ ఒంటెత్తు పోకడల వల్లే కాపు నాయకులు ఆయనకు దూరమయ్యేవరకూ వేచి వుండాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఎవరు వున్నారు ఎవరు వెళ్ళారు అన్నది ముద్రగడ పట్టించుకోరు. తాను అనుకున్నదే చేస్తారు.
మొండితనమే ముద్రగడ బలమూ, బలహీనతా కూడా! ఆయన ఎవరిమాటా వినడు ఎవరైనా ఆయన మాటే వినాలి అనే ధోరణి వల్లే ఆయనతో ఏ రాజకీయ నాయకుడూ సన్నిహితంగా వుండరు.
కాపులు తనవెంట వున్నారన్నదే ముద్రగడ పద్మనాభం ధీమా! బలం!!