మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీలోనే ఉంటారా..? అని తెలుగుదేశం పార్టీ టెన్షన్ పడుతోంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి వస్తారా.. రారా ? అని.. వైసీపీ కూడా టెన్షన్ పడుతోంది. ఆయన పార్టీలోనే ఉంటానని టీడీపీ అధినేతకు మాటిచ్చారు. కానీ ఒంగోలు నుంచి మాత్రం లోక్సభకు పోటీ చేయబోనని చెప్పేశారు. అదే ఒంగోలు లోక్సభ సీటు మాగుంట కోసం ఖాళీగా ఉంచామని.. ఆయన కోసం.. కుటుంబసభ్యులను కూడా పక్కన పెట్టామని.. వైసీపీ నేత జగన్ ..సమాచారం పంపుతున్నారు. కానీ ఆయన వైపు నుంచి స్పందన రావడం లేదు.
ఒంగోలు వద్దనుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నేతలు కోరారు. టీడీపీ అధినేతను ఇప్పటికి రెండు సార్లు కలిసిన మాగుంట పార్టీని వీడేది లేదని.. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం ఒంగోలు నుంచి పోటీ చేయవద్దని కోరుతున్నారని చెప్పేశారు. దాంతో చంద్రబాబు ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నారు. మరో వైవు వైసీపీలో… గందరగోళం ప్రారంభమయింది. మాగుంట వస్తాడని వై.వి. సుబ్బారెడ్డికి టిక్కెట్ లేదని చెప్పేశారు. దాంతో వైసీపీ డైలమాలో పడింది. నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం ప్రముఖులు మాగుంట శ్రీనివాసరెడ్డి తో భేటీ అయ్యారు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలకు గట్టి అభ్యర్దులు ఉండటంతో గెలుపు సునాయాసంగా ఉంటుందని మాగుంటకు చెప్పారు. అయితే దీనికి ఆయన పూర్తిగా అంగీకారం తెలియచేయలేదు. కుటుంబసభ్యులతో మాట్లాడి చెబుతానన్నారు. ప్రకాశం జిల్లాతో ఉన్నంత అనుబంధం.. మాగుంట ఫ్యామిలీకి నెల్లూరుతోనూ ఉంది. అక్కడ్నుంచి పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు.
నెల్లూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలో … మాగుంట నిర్ణయం తీసుకునే వరకూ.. వేచి చూడాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే.. ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా.. మాగుంట ఏటూ తేల్చకపోవడంతో… అటు వైసీపీలోనూ.. ఇటు టీడీపీలోనూ.. గందరగోళం ఏర్పడుతోంది.