పుల్వామా ఘటన అనంతరం సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలను రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదు. అయితే, ఆ మాట చెబుతూనే రాజకీయాలు చేస్తున్నవారిని ఏమనాలి..? ఇదే తరహా నీతులు వల్లిస్తూనే… రాజకీయాలకు మాట్లాడుతున్నారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో భాజపా తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు. ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీవైపు చూస్తున్నాయన్నారు. ఒకే ఒక్క దాడి చేసి పెద్ద సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టారనీ, ఈ ఘనత మోడీకి దక్కుతుందన్నారు జీవీఎల్. అభినందన్ ను విడుదల చేసే విధంగా పాకిస్థాన్ మెడలని వంచామని చెప్పారు.
పుల్వామా దాడిను కొంతమంది రాజకీయం చేస్తున్న ప్రయత్నాలు దురదృష్టకరమని జీవీఎల్ అన్నారు. మమతా బెనర్జీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారనీ, మనదేశంలో కూడా పాకిస్థాన్ కి హీరోలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాలతో ఎవ్వరూ రాజకీయాలు చేయకూడదనీ, చంద్రబాబు వ్యాఖ్యల్ని పాకిస్థాన్ బాగా వాడుకుంటోందని జీవీఎల్ అన్నారు. భాజపాను దెబ్బ తీసేందుకే పవన్ కల్యాణ్, చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. పీకే, చంద్రబాబుల మధ్య ఒప్పందాన్ని అంతర్జాతీయ స్థాయిలో పీకే అంటే పాకిస్థాన్ గా చూస్తున్నారంటూ జీవీఎల్ అన్నారు!
దేశభద్రతను రాజకీయాంశం చెయ్యకూడదు అంటూ చేస్తున్నది ఎవరు..? భారత్ లో పాకిస్థాన్ హీరోలు ఉన్నారని అనడం ఎంతటి తీవ్రమైన వ్యాఖ్య..? చంద్రబాబు వ్యాఖ్యల్ని పాక్ వాడుకుంటోందనడమూ అంతే..? వాస్తవానికి, పుల్వామా దాడి తరువాత కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్ ఎడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయ్యాయి. సర్జికల్ స్ట్రైక్ వల్ల భాజపా గ్రాఫ్ పెరిగిందని ఆయనే వ్యాఖ్యానించారు. ఈ లెక్కన దేశభద్రతను రాజకీయాంశంగా చూస్తున్నది ఎవరు..? ఇప్పుడు కూడా… ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయించిన ఘనత మోడీకి దక్కుతుందని జీవీఎల్ అంటున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో క్రెడిట్ గురించి మాట్లాడటమేంటీ..? ఘనత వారికే దక్కుతుందని జీవీఎల్ చెప్పడమేంటి..? జీవీఎల్ వ్యాఖ్యలు ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమైనవి. మనదేశంలో పాకిస్థాన్ హీరోలున్నారని ఆయన చేసిన వ్యాఖ్య ముమ్మాటికీ సరైంది కాదు.