తెలంగాణ పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్‌లిమిటెడ్‌గా వాడేసుకుంటున్నారు. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అలా ఫిర్యాదు ఇవ్వడం ఆలస్యం రంగంలోకి దిగి.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు, తనిఖీలు చేసి హడావుడి చేస్తున్నారు. ఎవరి దగ్గర సోదాలు చేయాలి.. ఎవరెవర్ని ప్రశ్నించాలి.. ఏఏ ప్రశ్నలు అడగాలో కూడా.. వైసీపీ నేతలే చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. వైఎస్ జగన్ సోదరి షర్మిల.. తనకు , ప్రభాస్‌కు అక్రమ సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అలా ఫిర్యాదు చేయగానే ఇలా రంగంలోకి దిగిపోయారు. ఈ సారి విజయసాయిరెడ్డి అదే తరహాలో ఓ ఫిర్యాదు చేశారు. దాని మీద పోలీసులు సాఫ్ట్ వేర్ కంపెనీలపై దాడులు ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా చోరీ అయిందని విజయసాయిరెడ్డి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. లబ్ధిదారుల డేటా మొత్తం హైదరాబాద్‌లోని…ఓ కంపెనీ ఆఫీసులో ఉన్నట్లు విజయసాయి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విజయసాయిరెడ్డి చెప్పిన ఐటీ కంపెనీలపై దాడులు చేశారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ అనే కంపెనీపై కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లిలోని రెండు ఆఫీసుల్లో సోదాలు చేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి డేటా చోరీ అయితే.. ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి కానీ.. ఓ ప్రతిపక్ష నాయకుడు పక్క రాష్ట్రంలో ఫిర్యాదు చేయడం.. దానిపై.. హైదరాబాద్ పోలీసులు వెంటనే దాడులు చేయడం …చూస్తూంటే.. తెలంగాణ పోలీసుల్ని వైసీపీ నేతలు ఎలా వాడుకుంటున్నారో అర్థమైపోతుందన్న విమర్శలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ… సభ్యత్వ నమోదు.. పక్కాగా ఉంటుంది. ఫేక్ సభ్యత్వాలు లేకుండా వోటర్ ఐడీ కార్డు కూడా అడుగుతారు. ఈ సభ్యత్వాలకు.. సంబంధించిన వ్యవహారం.. ఈ డేటా కంపెనీ చూసుకుంటుంది. టీడీపీలో సభ్యులుగా చేరిన సభ్యులు స్వచ్చందంగా ఇచ్చే సమాచారన్ని ఆ కంపెనీ భద్ర పరుస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సమాచారాన్ని .. తెలంగాణ పోలీసుల్ని ఉపయోగించి.. సేకరిస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా.. ఓట్ల తొలగింపు కోసం.. ఫామ్ 7 లను కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే టీడీపీ కార్యకర్తల సమాచారం సేకరించడానికే …ఇలా తెలంగాణ పోలీసుల్ని ప్రయోగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నిజానిజాలేమిటో బయటకు రావాల్సి ఉంది.