నర్సాపురం లోక్సభ టీడీపీ అభ్యర్థి అవుతారనుకున్న రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గత వారం ఆయన ప్రెస్మీట్ పెట్టి ఆ ప్రచారాన్ని ఖండించారు. టీడీపీ అధినేత తనకు టిక్కెట్ ఖరారు చేశారని, పార్టీ మారే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించారు. అయితే మూడు రోజుల కిందట జరిగిన నర్సాపురం రివ్యూకు రఘురామకృష్ణంరాజుకు పిలుపు రాలేదు. దాంతో తనకు టిక్కెట్ లేదని ఖరారు చేసుకున్న ఆయన వైసీపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తనకు సన్నిహిత మిత్రుడని, నాగార్జున కూడా తనకు స్నేహితుడని రఘురామకృష్ణంరాజు చెబుతూ వస్తున్నారు. కొద్ది రోజుల కిందట నాగార్జున కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిసింది కూడా రఘురామకృష్ణంరాజు టిక్కెట్ కోసమేనని చెప్పుకున్నారు.
నర్సాపురం టిక్కెట్ ను రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు ఇద్దామనుకున్నా, ఆయన ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పీకే లాంటి వాళ్లతో సన్నిహితంగా ఉండి, వచ్చే ఎన్నికల తర్వాత ఎంపీలు కీలకమయ్యే సమయంలో పార్టీ మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని, ఆయనకు హైదరాబాద్ లో ఆస్తులు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నందున ఈజీగా బీజేపీ బుట్టలో పడిపోతారని టీడీపీ హైకమాండ్ ఆలోచించినట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి ఆయన కేవీపీ వియ్యంకుడు. ఏ విధంగా చూసినా టీడీపీ ఆయన విధేయమైన నేత కాదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే నర్సాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ కోసం ఎదురు చూస్తున్నారు. నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకే టిక్కెట్ ఖరారు చేశారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం కొత్తపల్లికి కేటాయిస్తారని ప్రచారం జరగడంతో వైసీపీలోకి వెళ్లాలని రఘురామకృష్ణం రాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నర్సాపురంలో ఇప్పటి వరకు వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు. సిట్టింగ్ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడ్ని పార్టీలోకి తీసుకుని నిలబెట్టాలని భావిస్తున్నారు. అయితే రఘురామకృష్ణం రాజు మొదట్లో వైసీపీలోనే ఉండేవారు. కానీ జగన్ తీరు నచ్చక సరిగ్గా గౌరవించడం లేదని బయటకు వచ్చారు. బీజేపీలో చేరారు. కొన్నాళ్ల క్రితమే టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారు.