సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూల్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కోట్ల టీడీపీ కండువా కప్పుకున్నారు. కోట్లతోపాటు ఆయన సతీమణి కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కర్నూలు జిల్లా రాజకీయమంతా కోట్ల, కేఈ కుటుంబాల మధ్యనే తిరిగిందన్నారు. ఈరోజున రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్ర అని సీఎం అన్నారు. ఈ రెండు కుటుంబాల కలయిక రాజకీయం కోసం కాదనీ, పదవుల కోసమూ కాదనీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే వారు కలిశారన్నారు. కేఈ మాదన్న, కోట్ల విజయభాస్కర రెడ్డి కుటుంబాలు విలువలతో రాజకీయాలు చేశారన్నారు. ఎన్టీఆర్ కి సన్నిహితంగా విజయభాస్కర రెడ్డి ఉండేవారనీ, తాను కూడా విజయభాస్కర రెడ్డి కేబినెట్ లో పనిచేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
కోట్ల, కేఈ.. ఈ రెండు కుటుంబాలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రెండు ఫ్యామిలీస్ రాజకీయంగా పోటీ పడుతూనే ఉన్నాయి. ఓ దశలో ఈ రెండు కుటుంబాలూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడూ వర్గపోరు కొనసాగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక అంశం కూడా ఈ మధ్య తీవ్ర చర్చనీయాంశంగానే నలుగుతూ వచ్చింది. కోట్ల చేరికపై కేఈ స్పందన ఎలా ఉంటుందనే చర్చ తీవ్రంగా జరిగింది. కోట్ల ఆశిస్తున్న టిక్కెట్ల అంశమై కూడా కేఈ స్పందనే ఏంటనే ఉత్కంఠ కూడా కొనసాగింది. కోట్ల పార్టీలోకి వస్తున్నట్టుగా తనకు తెలియదని కూడా కేఈ వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. దీంతో జయప్రకాష్ రెడ్డి పార్టీలో చేరితే కేఈ కుటుంబ స్పందన వేరేలా ఉంటుందా అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి.
చివరికి, ఈ రెండు కుటుంబాలను ఒకే వేదిక మీదికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం ఫలించిందనే చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి కొత్తతరం వస్తున్న ఈ సందర్భంలో మార్పునకు సిద్ధపడాల్సిన అవసరం ఉంటుందంటూ కేఈని చంద్రబాబు ఒప్పించారనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ రెండు కుటుంబాలూ ఒకే వేదిక మీదికి వచ్చాయి. కేఈ, కోట్ల కలయికతో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరింత బలం చేకూరినట్టయింది. ఈ ఇద్దరూ దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే కాబట్టి, రాబోయే ఎన్నికల్లోసమష్టిగా జిల్లా మొత్తాన్ని ఏకతాటిపై నడిపించగలిగే అవకాశం ఉంది. మరి, ఈ అవకాశాన్ని ఈ ఇద్దరు నేతలూ ఎలా వినియోగించుకుంటారో వేచి చూడాలి.