ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రయత్న లోపమే అని ప్రతిపక్ష నేత జగన్ ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు. సమస్యలన్నింటికీ చంద్రబాబు పాలనే కారణం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని తీరు ప్రజలు గమనిస్తున్నదే. అయితే, ఏపీ అభివృద్ధికి టీడీపీ అడ్డం అన్నట్టుగా చెప్పే జగన్… ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ మాట మార్చారు! ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ… జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తటస్థంగా ఉంటున్నామనీ, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు జగన్. జగన్మోహన్ రెడ్డి అయినా, ఆంధ్రా ప్రజలైనా ‘ఢిల్లీ’ మాటలు నమ్మి మోసపోయామన్నారు. ఆంధ్రా ప్రజలుగానీ, వారి ప్రతినిధిగా ఉన్న తానుగానీ ఎవ్వరి మాటా నమ్మదల్చుకోలేదన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లకు మాత్రమే మద్దతు ఇస్తామన్నారు జగన్.
జగన్ వ్యాఖ్యల్లో రెండు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, ఆంధ్రా వెనకబాటు తనానికి ఢిల్లీ కారణమని అన్నారు. అంటే, ఆంధ్రాలో టీడీపీ విధానాల వల్లే హోదా రాలేదనీ, అభివృద్ధి ఆశించినట్టు జరగలేదంటూ వారు చేస్తున్న ప్రచారం సరైంది కాదని జగన్ స్వయంగా ఒప్పుకున్నట్టయింది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం… ఢిల్లీ వల్లే ఏపీ ప్రజలు మోసపోయారని చెబుతున్నారుగానీ, ‘ఢిల్లీలోని మోడీ సర్కారు’ తీరు వల్లనే అనే మాటను ఓపెన్ గా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ భాజపాని విమర్శించాల్సిన సందర్భం వచ్చినా… కాంగ్రెస్, భాజపాలను కలిపి మాట్లాడుతున్నారు.
మరో అంశం… ప్రత్యేక హోదా ఇచ్చేవారికే కేంద్రంలో మద్దతు అనడం! ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేనంటారు, కానీ హోదా ఇచ్చేవారికే మద్దతు అంటారు. జగన్ ఎవ్వరినీ నమ్మకపోతే… హోదా ఎవరిస్తారు..? భాజపా ఇవ్వదనేది చాలాచాలా స్పష్టం. ఇక, కేంద్రంలో మిగిలున్నది కాంగ్రెస్ పార్టీ. పోనీ.. కాంగ్రెస్ తో జగన్ కలిసి వెళ్తారా అంటే… ఆంధ్రాలో ఆ పార్టీ ఎక్కడుందని జగన్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకే తమ అవసరం ఉండొచ్చన్నారు. అంటే, హోదా సాధన విషయంలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ అవసరం వైకాపాకి లేదని చెప్తున్నట్టే కదా! మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల సాధన ఎలా అనే స్పష్టత జగన్ కి ఇప్పటికీ లేదనేది చాలాచాలా స్పష్టంగా కనిపిస్తోంది. హోదా ఇచ్చేవారికే మద్దతు అని ఇప్పటికీ అదే మాట చెప్తారు. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక… ఇక జగన్ మద్దతు కోసం ఎదురుచూసేవారు ఎవరుంటారు, జగన్ డిమాండ్లను పట్టించుకునే పార్టీ ఏది ఉంటుందనే లాజిక్ ఆయన ఇప్పటికీ మాట్లాడటం లేదు.