ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించడంతో.. కాంగ్రెస్ పార్టీ.. షాక్ అయింది. ఏం చేయాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్ కు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలిద్దరికీ నిరసన సెగ తగిలేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ప్రయత్నిస్తోంది. ఐదో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో, 6న ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిరసన చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఈ నెల 8న పినపాకలో పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఆత్రం సక్కు, రేగా కాంతారావుపై అనర్హత వేటు వేయాల్సిందిగా శాసనసభ స్పీకర్‌ను కోరాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిద్దరు ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్‌కూ ఫిర్యాదు చేయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రంగా నిరనస కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో అది ఆరంభశూరత్వంగానే మగిలిపోతోంది. ఎవరూ.. నాయకత్వాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎవరి లక్ష్యాలు వాళ్లకు ఉన్నాయి. ఇదే టీఆర్ఎస్ అధినేతకు… కొత్త బలం చేకూర్చి పెడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికి మంత్రి పదవి ఇచ్చినా… కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మహా అయితే.. అనర్హతా పిటిషన్లు.. స్పీకర్ వద్ద పెట్టగలరు. వాటిపై ఆయన ఎప్పటికీ నిర్ణయం తీసుకోరు. కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. కేసీఆరే రాజకీయ వ్యూహం మార్చి… మరికొంత మందిని పార్టీలో చేర్చుకుని… అందరితో రాజీనామాలు చేయించి.. మళ్లీ ఎన్నికలు పెట్టిస్తే తప్ప.. వారు టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సభ్యులుగానే ఉంటారు.
గత అసెంబ్లీలో కోమటిరెడ్డి, సంపత్‌లపై.. ఉత్తి పుణ్యాన అనర్హతా వేటు వేస్తే.. కలసికట్టుగా పోరాడలేకపోయారు. వారే న్యాయస్థానంలో న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడా కేసు.. కీలక దశకు చేరుకుంది. కానీ ఇప్పుడు దాని వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభం ఏమీ లేదు. అలాగే.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై వేసిన అనర్హతా వేటు విషయంలోనూ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. ఆ ఎమ్మెల్సీల ఫేట్ కి వదలేసింది. అనర్హతా వేటుకు గురయిన తర్వాత వారే న్యాయపోరాటం చేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించిన ఇద్దరు కాక.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు .. సమావేశానికి డుమ్మాకొట్టారంటేనే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. రెండు రకాల కారణాలు చెప్పి.. గైర్హాజర్ అయ్యారు.