‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన కొరటాల శివ లేటెస్ట్గా ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తనకు కొరటాల శివ చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చిందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ని చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడని మోహన్‌లాల్ చెప్తున్నాడు. అంతేకాకుండా నా క్యారెక్టర్ నేచురల్‌గా వుండడం కోసం తెలుగు నేర్చుకుంటున్నాడట మోహన్‌లాల్. తన క్యారెక్టర్‌కి తనే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది మోహన్‌లాల్ కోరిక.
ఇంతవరకు బాగానే వుంది కానీ ఈ సినిమాలో మలయాళ ఫ్లేవర్‌ని కాస్త ఎక్కువగానే జొప్పిస్తున్నాడు కొరటాల శివ. మలయాళ కుట్టి నిత్యమీనన్ ఈ చిత్రంలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. మరో హీరోయిన్ను ఎంపిక చెయ్యబోతున్నారు. మరో పాత్ర కోసం మలయాళ స్టార్ పహద్ ఫాజిల్‌ను ఎంపిక చెయ్యబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రధాన విలన్‌గా ముకుందన్‌ని సెలెక్ట్ చేసారు. దీన్ని బట్టి చూస్తుంటే కొరటాల శివ తెలుగు సినిమా చేస్తున్నాడా? మలయాళ సినిమా చేస్తున్నాడా? అనే డౌట్ అందరికీ వస్తోంది.