భారతీయ జనతా పార్టీ నేతల దేశద్రోహ రాజకీయం శృతి మించి పోతోంది. పాకిస్తాన్‌పై కన్నా.. ఇప్పుడు.. ఎక్కువగా.. మోడీ.. దేశంలో.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, విపక్ష పార్టీలపైనే ఆయన ఎక్కువగా గురి పెడుతున్నారు. అంతా పాకిస్తాన్ సపోర్టర్లే అన్నట్లుగా మాట్లాడుతూ.. సొంత దేశ ప్రజలను కించ పరుస్తున్నారు. ఇది మోడీ స్థాయిలో ఉద్ధృతంగా సాగుతోంది. బీజేపీ నేతలంతా.. ఎవరి స్థాయిలో వాళ్లు.. ఈ తరహా ప్రచారాన్ని విపక్ష పార్టీలు, వారికి మద్దతిస్తున్న వారిపై … చేస్తూనే ఉన్నారు. దానికి జీవీఎల్ నరసింహారావు కూడా మినహాయింపు కాదు.
భారతీయులందరికీ “దేశభక్తి శీల పరీక్ష” పెడుతున్న మోడీ, షా..!
సరిహద్దు ఉద్రిక్తతలను.. రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోవడంలో.. భారతీయ జనతా పార్టీ నేతలు బరితెగించేశారు. ఇందులో.. మోడీ నా.. జీవీఎల్నా అన్న తేడా లేదు. చివరికి.. మోడీ.. పాకిస్తాన్ తో చేతులు కలిపి విపక్షపార్టీలు తనను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపణలు చేసే వరకూ వ్యవహారం వెళ్లిపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా.. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా… దేశద్రోహి అనే ముద్ర వేయడానికి బీజేపీ రెడీ అయిపోయింది. తమను సమర్థించేవారే దేశభక్తులు.. లేకపోతే.. అంతా దేశద్రోహులే అన్నట్లుగా చిత్రీకరించడానికి.. బీజేపీ నేతలు తెగబడిపోతున్నారు. ఇది దేశ ప్రజల దేశభక్తిని శంకించడమే. దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకు.. బీజేపీ నేతలు.. ఓ రకంగా శీల పరీక్ష పెడుతున్నారు. మీ దేశభక్తి నిరూపించుకోవాలన్నట్లుగా.. అగ్రిప్రవేశం చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేతల ప్రచారసభల్లో ఇదే హైలట్. వీరు చెప్పేది ఒక్కటే.. ఎవరైనా సరే దేశభక్తిని నిరూపించుకోవాల్సిందేనని..!
పాకిస్తాన్ కూడా భారతీయుల్ని ఇంత కించపరచదేమో..?
పాకిస్తాన్‌ను బూచిగా చూపి… రాజకీయం చేసేందుకు బీజేపీ నేతలు నేలబారుకి దిగిపోతున్నారు. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా.. వారిపై దేశద్రోహ ముద్రవేస్తున్నారు. ఆడియో టేపులు మారిపోతున్నాయి. స్టేట్మెంట్లు తప్పుగా బ్రేకింగ్న్యూసులు అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో… బీజేపీని వ్యతిరేకిస్తూ మాట్లాడితే.. వాళ్లు పాకిస్తాన్ సపోర్టర్లుగా ముద్ర వేసేస్తున్నారు. దేశభక్తికి తామే బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే బీజేపీ నేతలు.. భారతీయుల్ని ఇంతగా అవమానిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడం బీజేపీ చేస్తున్న ఘోరమైన తప్పు. భారతీయుల పట్ల పాకిస్తాన్ కూడా ఇలా ఆలోచించి ఉండదు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా… తమను వ్యతిరేకించేవారిని.. భారత్ అనుకూలురుగా ముద్ర వేసే ప్రయత్నం చేయలేదు. ఎంతైనా.. తమలో తాము కొట్లాడుకుంటారేమో కానీ.. సొంత ప్రజల్ని శత్రువుగా భావించే భారత్ సపోర్టర్లుగా ముద్ర వేయరు. కానీ ఆ దౌర్భాగ్యం భారత్‌లోనే ఉంది. భారత ప్రజల్ని బీజేపీ దారుణంగా కించ పరుస్తోంది. పాకిస్తాన్ మద్దతుదారుగా ప్రచారం చేస్తూ.. అవమానిస్తోంది.
విడగొట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తానా..? బీజేపీనా..?
బీహార్‌లోని జేడీయూ పార్టీ గతంలో బీజేపీకి దూరం అయింది. అప్పట్లో ఆర్జేడీతో కలిసి జేడీయూ పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ పడింది. ఆ సమయంలో.. మోడీ, షాలు బీహార్‌లో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. వారు ఆ మీటింగుల్లో ప్రధానంగా చెప్పింది ఒక్కటే…” జేడీయూ నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే పాకిస్తాన్ సీట్లు పంచుతారు. టపాసులు పేలుస్తారు..” అని. ఇప్పుడు ఆ జేడీయూ ఎక్కడ ఉంది. బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. బీజేపీ, జేడీయూ కలిసి.. ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అంటే.. అంతకు ముందు నితీష్ కుమార్ పాకిస్తాన్ సపోర్టరంటూ..చేసిన వ్యాఖ్యలను బీజేపీ మర్చిపోయిందా..?. కానే కాదు.. భారతీయుల్ని విడగొట్టడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న రాజకీయంలో భాగం. పాకిస్తాన్ ను బూచిగా చూపి… బారతీయుల్ని రెండుగా విడగొట్టి.. రాజకీయ పబ్బం గడపుకోవాలనుకుంటోంది. దేశంలో అల్లకల్లలోం రేగినా.. తమకు కావాల్సింది అధికారం కాబట్టి.. అది వస్తుందని సంతోష పడుతోంది. మోడీ.. ఇటీవల కాలంలో.. పాకిస్తాన్ మనల్ని విడగొట్టాలని చూస్తోంది.. అని చెప్పుకొస్తున్నారు. అలా విడగొట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీనే. దేశానికి పాకిస్తాన్ తో ఎంత ముప్పు ఉందో.. బీజేపీతో అంత కన్నా ఎక్కువ ముప్పు ఉందని.. ఈ పరిణామాలతో తేలిపోతోంది. జాగో భారతీయడా.. జాగో..!