ప్రస్తుతం దేశమంతా కాశ్మీర్ గురించీ, పాక్ ప్రేరేపిస్తున్న టెర్రరిస్టుల గురించీ మాట్లాడుకుంటోంది. దేశ భక్తి నరనరాన ఉప్పొంగుతోంది. ‘జై హింద్’ నినాదం మార్మోగుతోంది. ఈదశలో సరిగ్గా పడాల్సిన సినిమా… ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. కాశ్మీర్‌లోని టెర్రరిజాన్ని కార్నర్ చేసుకుని తీసిన సినిమా ఇది. సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా కోసం రచయిత అబ్బూరి రవిని ప్రతినాయకుడిగా మార్చేశారు. టీజర్ అంతా ఒకే టెంపోలో సాగింది. ఓ స్నేహబృందం…. వాళ్లలో ఒకరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. అదీ.. కాశ్మీర్ తీవ్రవాదుల నుంచి. కమాండో అర్జున్ పండిట్.. దాన్ని ఎలా పరిష్కరించాడన్నది కథ. ‘ఉరి’ లాంటి చిత్రాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దేశ భక్తి అనే భావోద్వేగాన్ని సరిగా పండించగలిగితే చాలు. తెలుగులో అలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగినా… సాంకేతికంగా, కథ పరంగా సరైన కసరత్తు చేయకపోవడం వల్ల సఫలీకృతం కాలేదు. మరి ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌లో అలాంటి లోపాలు కవర్ చేశారేమో చూడాలి. నటీనటులు,సాంకేతిక నిపుణులు పారితోషికాలు తీసుకోకుండా.. ఈ సినిమాలో భాగస్వాములుగా మారిపోవడం విశేషం. మరి ఈ బంగారు చేప.. ఎన్ని కాసులు కురిపిస్తుందో చూడాలి.