హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తునిలో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపుగర్జన ఉద్యమం హింసాత్మక రూపు దాల్చింది. కాపు కార్యకర్తలు తుని రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. అంతకుముందు ఆందోళనకారులు పోలీసులు, రైల్వేసిబ్బందిపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో కొందరు పోలీసులు, రైల్వే సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. విధ్వంసానికి పాల్పడుతున్నవారిని పోలీసులు వీడియోలో చిత్రీకరిస్తున్నారు. ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభావేదికపై ముద్రగడ పద్మనాభం అనూహ్య నిర్ణయం తీసుకుని రోడ్ రోకో, రైల్ రోకోకు పిలుపునిచ్చారు. దీనితో లక్షల్లో వచ్చిన కాపు కార్యకర్తలు హైవేపైకి, పక్కనే ఉన్న రైలుపట్టాలపైకి తరలివెళ్ళి బైఠాయించారు. కొల్కతా-చెన్నై జాతీయ రహదారిపై వేలసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అటు రైల్వే లైన్లో కూడా విశాఖ-విజయవాడ మార్గంలో పలు రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.