గత వారం రోజులుగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో తాను మృతి చెందినట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొదట దీన్ని తేలికగా తీసుకున్న దాసరి ఇప్పుడు ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో దాసరి మరణ వార్తపై కామెంట్లు, పోస్టులు చాలా వస్తున్నాయని, వాటిని పోస్ట్ చేస్తున్న వారెవరో కనిపెట్టాలంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాసరి. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని దాసరికి హామీ ఇచ్చినట్టు సమాచారం.
బ్రతికి వున్న ఒక సెలబ్రిటీ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేస్తున్న వారు ఎవరై వుంటారు? కొందరి అభిప్రాయం ప్రకారం ఈమధ్య చిరంజీవి చెయ్యాలనుకున్న ‘కత్తి’ సినిమా విషయంలో చెలరేగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ వివాదాన్ని లేవనెత్తిన నరసింహారావు.. దాసరిని ఆశ్రయించడంతో ‘కత్తి’ కథ విషయంలో తమ సహకారం వుండదని 24 క్రాఫ్ట్స్ తెలియజేశారు. తమ అభిమాన హీరో ఎంతో ప్రెస్టీజియస్‌గా భావించిన 150వ సినిమా ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్తుండగా దాన్ని అడ్డుకోవడంలో దాసరి కీలక పాత్ర పోషించారని భావించిన మెగా అభిమానులే తనని బ్యాడ్ చేస్తున్నారని దాసరి భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది పోలీసుల విచారణలో వెల్లడి కానుంది.