ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్రంపై ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అక్కడ ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. అయితే.. రాజకీయ విశ్లేషకులు.. కేవలం.. బలాబలాలను విశ్లేషించగలరు కానీ ఫలితాలన్ని తేల్చి చెప్పలేదు. ఊహించగలరు కానీ.. కరెక్ట్‌గా చెప్పలేదు. ఆ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది..?
సంక్షేమ పథకాలతో అడ్వాంటేజ్ సాధించిన చంద్రబాబు..!
2014 ఎన్నికలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రాలేదు. అప్పుడు ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మాదిరిగా… ఏపీలోనూ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. కానీ ప్రభుత్వంపై మాత్రం.. ప్రభంజనంలా అసంతృప్తి లేదు. కొత్త రాష్ట్రమైన.. ఎంతో కొంత పనులు చేశారు కదా… అమరావతి లాంటి నిర్మాణాలు ఇంకా మధ్యలోనే ఉన్నాయి.. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఎలా అనే భావన ప్రజల్లో ఉంటుంది. ఈ అసంతృప్తిని సమీక్షించుకునే అవకాశం కూడా ప్రభుత్వాలకు ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని.. సంక్షేమ పథకాలతో అధిగమించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. పెన్షన్లు పెంచారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రూ. 10వేల సాయం చేస్తున్నారు. ఇలా .. సంక్షేమ పథకాలతో.. ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని పోగొట్టుకుని.. సానుకూలత సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషం సంక్షేమ పథకాల మేనేజ్‌మెంట్.. టీడీపీకి పెద్ద ప్లస్‌పాయింట్‌గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తానని చెబుతున్నారు. కానీ టీడీపీ ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించింది.
ఏపీకి అండగా ఉండే ప్రభుత్వంలో టీడీపీ పాత్ర..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఓ రకమైన పరిస్థితి ఉంది. కేంద్రం మద్దతు లేకుండా.. ఏపీ ప్రభుత్వం మనుగడ సాగించదు.. అనే భావన ఏర్పడింది. 2014లో చంద్రబాబు ప్రజల్లో ఈ భావన ఉందని గుర్తించి.. అప్పటికే దేశంలో ఉన్న మోడీ పాజిటివ్ వేవ్‌ను అవకాశం చేసుకుని బీజేపీతో పొత్తు కోసం సిద్ధపడ్డారు. ఏపీకి బీజేపీ మద్దతుగా ఉంటుందని భావించిన ప్రజలు.. రాష్ట్ర విభజనలో ఆ పార్టీ పాత్ర కీలకమైనా.. ఆహ్వానించారు. కానీ.. ఈ ఐదేళ్లలో ఏపీకి ఆ పార్టీ చేసిందేమీ లేదు. అందుకే.. ప్రజల అసంతృప్తిని గమనించి.. చంద్రబాబు… బయటకు వచ్చేశారు. మళ్లీ కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పుడు.. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనంటోంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారు. కేంద్రంలో.. అయితే.. కాంగ్రెస్.. లేకపోతే బీజేపీ… అదీ కాకపోతే.. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఉన్న సంకీర్ణ ప్రభుత్వం రావాలి. దీన్ని చంద్రబాబు కీలకంగా తీసుకున్నారు. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వనంటోంది. ఇస్తానంటోంది కాంగ్రెస్ కాబట్టి… హోదా వచ్చే ఒకే ఒక్క దారిని.. చంద్రబాబు ఎంచుకున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వీక్‌గా ఉన్నారు.
రాయలసీమ సెంటిమెంట్, కమ్మ వ్యతిరేకతను నమ్ముకున్న జగన్..!
జగన్మోహన్ రెడ్డికి కొన్ని బలాలున్నాయి. ఆయన సామాజికవర్గ పరంగా.. రాయలసీమలో అడ్వాంటేజ్ సాధిస్తున్నారు. అదే సమయంలో.. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని వల్ల అక్కడ ఆయనకు సీట్లు పెరగవచ్చు. అదే సమయంలో.. పవన్ ఓ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. అదేమిటంటే.. కమ్మ సామాజికవర్గంపై.. ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేయడం. పోలీసుల్లో అందరూ కమ్మ సామాజికవర్గం వారేనని ప్రచారం చేయడం దీనికి సూచిక. తెలుగుదేశం పార్టీకి ప్రధాన మద్దతుదారులుగా.. కమ్మ సామాజికవర్గం వారు ఉంటారు. వారిపై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సామాజిక అంశాల్లో వస్తున్న మార్పులు.. జగన్‌కు కొంత లాభం కలగవచ్చు.
కాపు ఓటింగ్ ను ఆకర్షించడంలో జగన్ విఫలం..!
జగన్మోహన్ రెడ్డి.. కొన్ని అంశాల్లో విఫలమయ్యారు. వాటిలో కాపు ఓటింగ్ ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీకి చరిత్రలో తొలిసారి కాపులంతా ఓటు వేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ దూరమయ్యారు. అయినప్పటికీ.. కాపు ఓటింగ్ పూర్తిగా టీడీపీకి దూరం అయిందని నేను అనుకోను. దీనికి కారణంగా.. జగన్మోహన్ రెడ్డి కౌంటర్లు చేయలేకపోవడం వల్లే. కాపు రిజర్వేషన్ల అంశంలో.. చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతంలో.. ఐదు శాతం కాపులకు ఇచ్చేశారు. అది నిలబడుతుందా.. లేదా అన్నది తర్వాత విషయం చేయాలనుకున్నది చేశారు. జగన్మోహన్ రెడ్డి అది కూడా ఇస్తానని చెప్పడం లేదు. ఆయన ఇవ్వలేననే ఇప్పటికీ చెబుతున్నారు. దీనికి తోడు.. జనసేన బాగా బలపడి.. ఓ రాజకీయ శక్తిగా ఎమర్జ్ అయి ఉంటే.. కాపు ఓటు షిఫ్ట్ అయ్యేది. ఆ పరిస్థితి లేకపోవడం వల్ల కాపు ఓటు టీడీపీతోనే ఉంటుంది. 2014నాటి పరిస్థితుల్లో గుణాత్మక మార్పు రాకపోవడంతో.. ఎవరు గెలుస్తారనే విషయంపై కన్ఫ్యూజ్ అవుతుంది.