తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బాధ్యత మొత్తాన్ని కేటీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ కొన్ని ప్రచారసభల్లోనే పాల్గొంటారు. మిగతా వ్యూహం మొత్తం కేటీఆర్ చూసుకుంటున్నారు. కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా టీఆర్ఎస్ కు కలిసి వచ్చిన జిల్లా ఉమ్మడి కరీంనగర్. ఉద్యమంలో ఒకరకంగా ఆపార్టీకి ఊపిరినిచ్చింది కరీంనగరే. అందుకే కేసీఆర్ ఏ పని చేసినా ఈజిల్లా నుంచే మొదలు పెడతారు. రాజీనామాల పర్వం మొదలైందీ జిల్లా నుంచే.
అందుకే ఏపని ప్రారంభించినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పై ప్రత్యేక సెంటిమెంట్ ఉండటంతో ఇక్కడి నుంచే మొదలు పెడతారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు కూడా ఈజిల్లా నుంచే ప్రారంభించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల శంఖారావం కూడా ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే మోగించారు. కేసీఆర్. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఈ సారి మౌలికమైన మార్పు.. కేటీఆర్ ఈ బాధ్యత తీసుకోవడం.
లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. కానీ కరీంనగర్ నుంచి మళ్లీ ప్రస్తుత ఎంపీ వినోద్ కుమారే పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ సిరిసిల్లలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. కరీంనగర్ లో తొలి సభ నిర్వహించేందుకు ఇది కూడా ఒక కారణమే అని పార్టీలో చర్చించుకుంటున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాక పాల్గొనే అతిపెద్ద బహిరంగ సభ కూడా కరీంనగర్ సభ. అందుకే సత్తా చాటాలనుకుంటున్నారు.