మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్లో చక్కర్లు కొడుతున్నారు. మంగళవారం రోజు ఆయన అటు స్పీకర్ కోడెలతోనూ, ఇటు వంగవీటి రాధాతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాజకీయవర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో ఆయన టీడీపీ అధినేతతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పలు మార్లు భేటీ అయ్యారు కూడా. భేటీ అయినప్పుడల్లా ఆయన టీడీపీలో చేరుతారని, ఏదో ఓ స్థానం నుంచి పార్లమెంట్కో అసెంబ్లీకో పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా కోడెల, వంగవీటి రాధాలను కలవడం దేనికోసమన్న చర్చ ప్రారంభమయింది.
వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేశారు కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తెలుగుదేశం పార్టీ ఆహ్వానించినా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్ ఆయనకు నచ్చలేదంటున్నారు. కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలోనే లగడపాటి రాజగోపాల్ ఆయనను టీడీపీ తరపున విజయవాడ నుంచి కాకుండా ఇతర చోట్ల పోటీ చేసేందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరడంతో నర్సాపురం టిక్కెట్ ఒకటి పెండింగ్లో ఉంది. అక్కడ క్షత్రియ సామాజికవర్గంతో పాటు కాపు సామాజికవర్గానికి కూడా రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలో ఓ చోట నుంచి పోటీ చేయాలని లగడపాటి వంగవీటికి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల బాధ్యతలను కోడెల చూస్తున్నారు. ఆయన ఈ సారి నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన నియోజకవర్గం అదే. అయితే సత్తెనపల్లిలోనూ కాపు సామాజికవర్గ ప్రభావం అధికంగానే ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగానే ఉంటుందని వివరించే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. మొత్తానికి లగడపాటి తన సర్వే రిపోర్టులతో టీడీపీ అధినేతకు అభ్యర్థుల ఎంపికలో కూడా సహకరిస్తున్నారని మాత్రం టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.