ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చిక్కుల్లో ఇరుక్కోవడం, తప్పులు చేయడం కొత్త కాదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతిలో పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ… జగన్ వల్ల ఎంతోమంది కేసుల్లో చిక్కుకున్నారనీ, వారంతా మానసికంగా చాలా బాధపడుతున్నారన్నారు. వైకాపాలో తప్పులు చేసేవారికే చోటు ఉంటుందనీ, నేరగాళ్లకే అక్కడ అవకాశాలు ఉంటాయన్నారు. వైకాపాలో ఉంటే ఎవరైనా సరే తప్పు చేయాల్సిందేనని, ఆ పార్టీలో పద్ధతి అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు.
వైకాపా నేతలు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇలాంటి ఆంబోతులను ఎలా నియంత్రించాలో తనకు బాగా తెలుసు అన్నారు. ఓట్ల తొలగింపు కోసం వైకాపా కుట్రలు చేస్తోందనీ, ఈ కుట్రలో కూడా అక్యూజ్డ్ వన్ గా జగన్ ఉంటారన్నారు. ఫారమ్ – 7ని ప్రతిపక్ష నేత దుర్వినియోగం చేస్తున్నారనీ, అదే విషయాన్ని జగన్ స్వయంగా ఒప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు ముఖ్యమంత్రి. ఓట్ల తొలగింపు కోసం దాదాపు 13 లక్షల దరఖాస్తులను ఎలా పంపుతారని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో అందరూ సరిచూసుకోవాలనీ, ఓట్లు పోయినవారంతా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలంటూ సీఎం వ్యాఖ్యానించారు. 25 వేల మంది సేవా మిత్రలతో త్వరలో సమావేశం కాబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సేవామిత్రలను మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతన తనదే అన్నారు. కుల రాజకీయాలకు పాల్పడుతున్నవారికి ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారనీ, అన్ని కులాల వారితోనూ అన్నదమ్ముల్లా నాయకులు మెలగాలనీ, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని సీఎం చెప్పారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు అంటూ వైకాపా మొదలుపెట్టిన పోరాటం బూమ్ రేంగ్ అయిందనే అనిపిస్తోంది. తమ ఓటర్లను అధికార పార్టీ తొలగిస్తోందంటూ ఈ మధ్య వైకాపా నేతలు, వారి పత్రిక విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసి మరీ వచ్చారు. ప్రస్తుతం ఈ డాటా చోరీ అంశం తెరమీదికి రావడం, ఫారమ్ 7లను వైకాపా సానుభూతిపరులే పెద్ద సంఖ్యలో దాఖలు చేయడం… ఇవన్నీ కలిసి ఆ పార్టీకి కొత్త సమస్యలుగా మారుతున్నాయి. అంతేకాదు, ఈ ఫారమ్ 7 కుట్ర తామే చేయించామనే అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యానించడం కూడా మరో ఇబ్బందికరమైన అంశంగా కనిపిస్తోంది.