మేనిఫెస్టో కమిటీ సభ్యులతో వైయస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాగ్దానాలు ఉంటాయనీ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలను కూడా పరిగణిస్తామన్నారు జగన్. వైకాపా మేనిఫెస్టో సంక్షిప్తంగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు వాగ్దానాలు చేయడంలో ఏ పార్టీతో తమకు పోటీ లేదన్నారు. పార్టీ మేనిఫెస్టోలో చేసే ప్రతీ వాగ్దానమూ ఎంతో నిజాయితీగా ఉంటుందన్నారు. నవరత్నాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత దక్కుతుందన్నారు.
ఇప్పటికే చాలా హామీలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి! నవరత్నాలు రెండేళ్ల కిందటే ప్రకటించేశారు. ఇక, పాదయాత్రలో ఆయన సభ పెట్టిన ప్రతీచోటా చాలా వాగ్దానాలు వరదలా ఇచ్చుకుంటూ వచ్చారు. పాదయాత్రలో ఇచ్చినవీ, నవరత్నాలు, ఇప్పుడు కొత్తగా చేర్చబోతున్నవీ ఇలా అన్నీ తమ మేనిఫెస్టోలో ఉండబోతున్నట్టు జగన్ అభిప్రాయపడుతున్నారు. అయితే, ఒక రాజకీయ పార్టీ ఇచ్చే హామీల్లో నిజాయితీ శాతం ఎంత ఉందని ప్రజలు చూస్తారా? ఆ హామీలు ఆచరణ సాధ్యంగా ఉన్నాయా లేదా అనేది కదా ప్రజలు చూసేది. జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్యాలంటే వేల కోట్ల నిధులు అదనంగా అవసరమౌతుందనే లెక్కలు ఇంతకుముందే చాలా వచ్చాయి. ఆ నిధులను జగన్ ఎక్కడి నుంచి తెస్తారు అనేదే ప్రశ్న?
మరో ముఖ్యమైన విషయం.. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే సంక్షేమ పథకాల కంటే, రాష్ట్ర అభివృద్ధికి ఆయా పార్టీలకు ఉన్న విజన్ ఏంటనేది ప్రజలు ప్రధానాంశంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడున్నవాటికే మరికొంత సొమ్ము పెంచి ఇస్తామని చెప్పగలరుగానీ, అనూహ్యమైన పథకాల హామీలు ఇచ్చే ఆస్కారం తక్కువ. ఆంధ్రాకి ప్రత్యేక హోదా జగన్ ఎలా తెస్తారు? జాతీయ స్థాయిలో భాజపా, కాంగ్రెస్ పార్టీల్లో దేనితోనూ పొత్తు లేకపోతే హోదా ఎలా వస్తుంది? హోదా ఇస్తామంటున్న పార్టీలను జగన్ నమ్మరు! ప్రాక్టికల్ గా కేంద్రం నుంచి ఏపీ కి ప్రయోజనాలను ఎలా సాధించగలరనే స్పష్టత జగన్ కు ఉండదు, కానీ ఆ అస్పష్టతతో ఆయన ఇచ్చే హామీలను ఏపీ ప్రజలు నమ్మేయాలన్నమాట! మరి, త్వరలో రాబోయే మేనిఫెస్టోలో ప్రజలు ఎదురుచూస్తున్న స్పష్టత ఏమేరకు ఉంటుందో చూడాలి.