కేంద్రంలో మనమే చక్రం తిప్పుతాం, ప్రభుత్వ ఏర్పాటులో కీలకమౌతాం, మనం చెప్పినవారే అధికారంలోకి వస్తారు, ఇదే అజెండాతో 16 మంది తెరాస ఎంపీలను గెలిపించాలని కేటీఆర్ కోరారు. కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోడీ వల్ల దేశం బాగుపడదని గత ఐదేళ్లలో స్పష్టమైపోయిందనీ, అందుకే దేశ ప్రజలు ఈసారి భాజపాకి మరో అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఒక్కో రాష్ట్రంలో భాజపా అధికారం కోల్పోతూ వస్తోందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉందనీ, రాహుల్ గాంధీ ఏమీ చెయ్యలేరంటూ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా వివిధ సర్వేలు చూస్తుంటే ఎన్డీయే, యూపీయే ఈ రెండు కూటములకు 150 నుంచి 180 ఎంపీ సీట్లకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. చివరికి ఆ రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి ఉండదన్నారు.
16 ఎంపీ స్థానాలు సాధిస్తే ఢిల్లీలో ఎవరు గద్దెని ఎక్కాలనేది మనమే నిర్ణయిస్తామన్నారు కేటీఆర్. దేశరాజకీయాల్లో ఫెడరల్ ఫ్రెంట్ కీలకం అవుతుందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలవబోతున్నాయనీ, నాయకులందరితోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ టచ్ లో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ మేథో సంపత్తిగల నాయకుడని, తెలంగాణలో ఆయన అందిస్తున్న పాలనను దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంటుందని అన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒకటో రెండో ఎంపీ సీట్లు వచ్చినా ఉపయోగం లేదనీ, ఢిల్లీకి గులాం గిరీ చేసే పార్టీ అని విమర్శించారు. లోక్ సభలో తెలంగాణ బిడ్డలు ఉండాలంటూ తన ప్రసంగానికి సెంటిమెంట్ యాంగిల్ కూడా జోడించారు.
కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రెంట్ ను చూపించి, 16 ఎంపీ సీట్లు గెలిపించాలని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి, ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాల్ని కేసీఆర్ ఆపేసి చాలారోజులైంది. జాతీయ నేతలతో కేసీఆర్ టచ్ లో ఉన్నారని కేటీఆర్ అంటున్నారుగానీ, కేసీఆర్ టచ్ లోకి వెళ్లిన ఏ జాతీయ నేత కూడా, ఫెడరల్ ఫ్రెంట్ కి సానుకూలంగా స్పందించలేదు. మూడో ప్రత్యామ్నాయంపై భావసారూప్యత కలిగిన పార్టీలు ఎక్కడున్నాయి? ఫెడరల్ ఫ్రెంట్ ఉంటుందో లేదో, దాన్లోకి రాబోయే పార్టీలు ఏవో తెలీదుగానీ, ఆ అదృశ్య కూటమికి 100 ఎంపీ సీట్లు వచ్చేస్తాయని చెప్పడం మరీ విడ్డూరం! లోక్ సభ ఎన్నికల్లో కూడా సెంటిమెంట్ తోనే ఎంపీ స్థానాలను గెలుచుకునే వ్యూహంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది.