సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్లతో యుద్ధం తప్పిపోయిందేమో కానీ.. సమైక్య రాష్ట్రం విడిపోయి.. అలాగే మారిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం.. మరో సారి ఎన్నికల ముందు యుద్ధం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రెండు ప్రభుత్వాలు.. మరొకరి అంతర్గత విషయాల్లో కేసులు నమోదు చేసుకున్నాయి. ఇంతకీ ఎవరి వాదనల్లో బలం ఉంది..? ఎవరి కేసుల్లో సాక్ష్యాలు ఉన్నాయి…?
తెలంగాణ కేసులేమిటి..?
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో.. ముడి పడి ఉన్న రెండు కేసులను వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు తీసుకుని పోలీసులు నమోదు చేశారు.
అందులో మొదటిది :
ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్ కంపెనీ వద్ద ఉంది. ఏపీ ప్రభుత్వం వద్ద నుంచి చోరీ చేశారు. దీన్ని లోకేశ్వర్ రెడ్డి అనే జగన్ బంధువు ఇచ్చారు.
రెండో ఫిర్యాదు :
టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ఓట్లు తీసేస్తున్నారు.
మొదటి ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వం తరపున.. అక్కడి డేటాను పర్యవేక్షించే అధికారులు.. టెక్నికల్ వివరాలతో సహా… వివరణ ఇచ్చారు. ఆధార్ డేటా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఏపీకైనా.. అవసరానికి బట్టే యాక్సెస్ ఉంటుంది కాబట్టి… ఏపీ నుంచి లీక్ అయ్యే చాన్స్ లేదన్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ వద్ద కూడా ఆధారాల్లేవు. ఏమైనా దొరకుతాయేమోనని… సర్వర్లు అన్నీ జల్లెడ పడుతున్నారు. ఇక రెండో ఫిర్యాదు. ఇది మరీ విచిత్రం.. తన ఓటు తీసేశారని.. ఓ ఏపీ ఓటర్.. హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారట. ఆయన హైదరాబాద్ లో ఉంటారట.. ఆయన ఓటు పోవడానికి సేవామిత్ర యాప్‌కు సంబంధం ఏమిటంటే.. సేవామిత్ర యాప్ ద్వారా సర్వేలు చేసి ఓటు తీసేశారట. ఓటు ఎలా తీసేస్తారో.. ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓటు ఎలా పోయిందో.. ఎన్నికల సంఘాన్ని ఒక్క మాట అడిగితే చెబుతుంది. కానీ.. ఇలా యాప్ ద్వారా తీసేశారని చెప్పని పోలీసులు.. కనిపించడం లేదని కొత్త వాదన వినిపించి.. కేసు కంటిన్యూ చేస్తున్నారు. సర్వేలు చేయడమే పెద్ద నేరమన్నట్లుగా.. అంజనీకుమార్ మాట్లాడటంతోనే కేసు వ్యూహం ఏమిటో స్పష్టమవుతోంది.
తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసేమిటి..?
తమ డేటా చోరీ చేసి వైసీపీకి తెలంగాణ పోలీసులు ఇచ్చారు..!
తెలంగాణ పోలీసులపై తెలుగుదేశం పార్టీ గుంటూరులో దొంగతనం కేసు పెట్టింది. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మార్చి 2వ తేదీ అర్థరాత్రి ఫిర్యాదు ఇచ్చారు. దాని ప్రకారమే సోదాలు చేశాం. ఉద్యోగుల్ని ప్రశ్నించాం.. అని.., సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. కానీ.. సైబరాబాద్ పోలీసులు ఫిబ్రవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఆ సీసీ కెమెరాల దృశ్యాలు ఉన్నాయి. సమాచారం డౌన్ లోడ్ చేసి తీసుకెళ్లారని… దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా టీడీపీ పోలీసులకు అందించింది. అలాగే.. మీ డేటా మా దగ్గర ఉందంటూ.. బెదిరిస్తూ.. వైసీపీ కాల్ సెంటర్ల నుంచి టీడీపీ బూత్ లెవల్ కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయి. ఆ డేటా తెలంగాణ పోలీసులే ఇచ్చారనేది వాదన.
ఎవరిది బలమైన వాదన..!
టీడీపీ సేవామిత్ర అనే యాప్.. టీడీపీ కార్యకర్తల యాప్. యాప్‌లో ఉన్న సమాచారం అంతా స్వచ్చందంగా వచ్చినదే. అందులో అక్రమంగా వచ్చిన సమాచారం ఏమీ లేదని టీడీపీ చెబుతోంది. కానీ ఏదో ఉందని… తెలంగాణ ప్రభుత్వం.. ఐటీ గ్రిడ్ సంస్థలో సర్వర్లను తీసుకుని మరీ ఢిల్లీకి వెళ్తోంది. కానీ టీడీపీ మాత్రం.. 23వ తేదీన దొంగతనం జరిగిందని.. ఆధారాలు ఇస్తోంది. ఓ రకంగా.. తెలంగాణపై టీడీపీ పెట్టిన వాదనలోనే బలం కనిపిస్తోంది. కానీ.. ఏమీ లేకపోయినా.. తమ దగ్గర ఏదో ఉందని ప్రచారం చేసుకునేందుకు .. తెలంగాణ సర్కార్ ఏకంగా 9మంది ఉన్నతాధికారులతో సిట్ వేసింది. అందుకే కేసు మలుపులు తిరుగుతోంది.
కొసమెరుపేమిటంటే… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు.. ఆయా ఫిర్యాదులపై కేసులు పెట్టే అర్హత లేదు. కానీ పోలీస్ మార్క్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇది వివాదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.