ఆరు నూరైనా సరే ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకూడదనేది.. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల లక్ష్యం. ఈ విషయాన్ని ఆ పార్టీలు నేరుగానే చెబుతున్నాయి. చంద్రబాబును ఓడించడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నాయి. ఏపీలో అసలు ప్రధాన ప్రతిపక్షం.. పోరాటం అనేదే కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి అందుతున్న అస్త్రాలనే నమ్ముకుంటోంది. ఐదేళ్ల ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమం విషయాలు పక్కకుపోయాయి. చంద్రబాబు టార్గెట్‌గా అసలేం జరుగుతోంది..? . చంద్రబాబును ఓడిస్తే.. ఈ బయట వ్యక్తులకు వచ్చే లాభం ఏమిటి..? జగన్ సీఎం అవ్వాలని.. ఎందుకంత తాపత్రయ పడుతున్నారు…?.
ఇప్పుడు టీడీపీ పోరాడుతోంది టీఆర్ఎస్తోనే..!
ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితినే ప్రధాన ప్రతిపక్షం. వైసీపీ ఆ పార్టీ ముసుగు మాత్రమే. ఆ పార్టీ ఏ అంశాన్ని రైజ్ చేస్తే.. ఆ అంశాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసుల్ని దీని కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారంపై టీడీపీపైనే అనుమానం అని షర్మిల కేసు పెడితే… క్షణాల్లో దర్యాప్తు బృందాలు పరుగులు పెట్టాయి. విజయసాయిరెడ్డి నోటి మాటగా చెప్పారో.. మరో కారణమో కానీ.. టీడీపీకి యాప్ సర్వీస్ అందిస్తున్న కంపెనీపై దాడి చేశారు. దానికో రంగు పులిమారు. తెలంగాణలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఓట్లు పోయిన వాళ్లు.. రాజకీయ పార్టీలు ఎంత అరచి గీ పెట్టినా.. ఈసీ పట్టించుకోలేదు. కానీ.. ఏపీలో తన ఓటు పోయిందని.. వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే.. టీడీపీ యాప్ నే కారణమని పోలీసులు ఎటాక్ చేశారు. నిజానికి ఆ ఓటు తెలంగాణలోనే ఉంది.
తెలంగాణలోలా లక్షల ఓటర్లు గల్లంతు చేసే కుట్ర..!
ఓటర్ల జాబితాలో మార్పు చేర్పుల కోసం చాలా పెద్ద స్కెచ్ జరిగిందని.. టీడీపీ అనుమానిస్తోంది. సీఈవోను మార్చడం దగ్గర్నుంచే ఈ స్కెచ్ జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ స్కెచ్ వెనుక చాలా దీర్ఘ కాలిక ప్రణాళిక ఉందంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు కిటుకును.. ఏపీలో అమలు చేయాలని చూశారని అనుమానిస్తున్నారు. ఇదంతా బయట నుంచే జరిగిందని టీడీపీ అనుమానం. తెలంగాణలో ఓట్ల గల్లంతు ఐడియానో… మరో కారణమో కానీ.. జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టారు. ఏపీలో టీడీపీ కార్యకర్తల డేటా ఎలా వచ్చిందో కానీ.. గుర్తు పెట్టుకుని.. ఓటర్ కార్డుల నెంబర్లతో… నియోజకవర్గాల వారీగా.. ఓట్లను తీసేయాలంటూ.. వెల్లువగా ఫామ్ -7 దరఖాస్తులు పెట్టించారు. వీటిని పెట్టించడానికంటే ముందే ఓట్లు తీసేస్తున్నారని.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రచ్చ చేశారు. చివరికి ఓట్లు తీసేయమని ఫామ్-7లు తామే ఇచ్చినట్లు అంగీకరించారు. ఈ ఐడియా వెనుక దాగి ఉన్న కోణం ఏమిటో పోలీసులు పెట్టిన వందల క్రిమినల్ కేసుల్లో వెల్లడి కావాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ.. ఏపీలో తాము డిపాజిట్లు తెచ్చుకుంటామని ఎక్కడా చెప్పడం లేదు. కానీ చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు. మోదీ, షాలు మార్చి మార్చి ఏపీకి వస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలపై మాట్లాడరు కానీ.. చంద్రబాబుుపై మాత్రం దుమ్మెత్తి పోసిపోతారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనరు. ఐటీ, ఈడీల్ని ప్రయోగించి.. టీడీపీకి చెందిన ఎంపీ అభ్యర్థులందర్నీ… భయపెట్టి.. వైసీపీలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీపై పెత్తనం కోసమే… టీఆర్ఎస్, బీజేపీ అసలు ప్లాన్..!
జగన్ ను గెలిపించడానికి టీఆర్ఎస్ , బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. నిజానికి.. వీరి లక్ష్యం జగన్ ను సీఎం చేయడం కాదు. కేవలం చంద్రబాబును ఓడించడమే. పవన్ కల్యాణ్ ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగి ఉంటే.. బహుశా ఆయన వైపే ఉండేవారేమో. అందుకే మొదట్లో.. రెండు పార్టీలు పవన్ ను దగ్గరకు తీశాయి. ఇప్పుడు లెక్కలోకి తీసుకోవడం లేదు. అసలు.. చంద్రబాబును ఓడిస్తే.. టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చే లాభం ఏమిటనేది.. ఏపీలో విస్త్రతంగా జరుగుతున్న చర్చ. జగన్ సామంతరాజులా పడి ఉంటాడని.. ఎగువ నుంచి ఏపీకి రావాల్సిన నీరు మళ్లించడానికి కడుతున్న ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులు రావని.. అలాగే ఉమ్మడి సంస్థల విభజన, కరెంట్ బాకీల విషయంలో.. కేసీఆర్‌ను నోరెత్తి అడిగే సాహసం చేయరని.. అదే సమయంలో.. హైదరాబాద్ నుంచి… ఏ సంస్థలూ, పరిశ్రమలు..అమరావతి వైపు ఆకర్షణకు గురి కాకుండా ఉంటాయనే ప్లాన్‌తో టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటున్నారు. అందుకే.. చంద్రబాబును ఓడించడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే.. ఏపీలో టీడీపీ రాకపోతే.. పొరుగు రాష్ట్రానికి కప్పం కట్టుకుని బతకాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఎంపీ సీట్లు. ఆయన గెలిచే సీట్లు.. కేంద్రంలో తమకు ఉపయోగపడతాయని నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు వారి మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగిందని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.