‘జనం ఏమనుకుంటున్నారో మనకు అనవసరం, మనం అనుకున్నదే జనం అనుకోవాలి’… వైకాపా పత్రిక సాక్షి ఏకైక అజెండా ఇది. వాస్తవాలతో పనిలేదు, ప్రజాభిప్రాయంతో అవసరంలేదు, ప్రజల్లో జరుగుతున్న చర్చతో సంబంధం లేదు. తాము చెప్పిందే నిజం, రాసిందే వేదం అన్నట్టుగా ఆ పత్రిక తీరు ఉంటోంది. తాజాగా ఈ డాటా చోరీ వ్యవహారంపై గడచిన కొద్దిరోజులుగా ప్రజల్లో గందరగోళ పరిస్థితిని సృష్టించే ప్రయత్నం సాక్షి చేసింది. ప్రజలకు సంబంధించిన కీలక డాటా పోయిందనీ, ఓటర్ల జాబితాను టీడీపీ ఆఫీస్ లో కూర్చుని రాసేస్తున్నారన్నట్టుగా కథనాలు వండివార్చారు. ఇవాళ్ల మరో అడుగు ముందుకేసి… ప్రజలు భగ్గుమంటున్నారు అంటూ ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ‘గద్దెనెక్కిస్తే చోరీ చేస్తారా’ అంటూ ప్రజలు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారంటూ, ప్రజల కోణాన్ని ఎత్తుకుని కథనం రాశారు.
ముఖ్యమంత్రి ఎవరు అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు! బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నంబర్లు, ఓటర్ల జాబితాలు… వీటిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ఆయన ఎవరు అంటూ ప్రజల తరఫున ప్రశ్నించింది సాక్షి? కోట్ల మంది సంధిస్తున్న ప్రశ్నలు ఇవే అంటూ రాసుకొచ్చారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిందంటూ సమర్థింపు! ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ, కీలక డాటా ఎలా దొంగతనానికి గురైందనీ, దీనికి బాధ్యులు ఎవరని ప్రజలు ప్రశ్నిస్తుంటే… దాన్నుంచి దృష్టి మరల్చడానికి ప్రతిపక్షంపై విమర్శలకు దిగుతున్నారంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాశారు. పెనుసంచలనం సృష్టిస్తోన్న సర్కారు దొంగతనం అంటూ మొత్తంగా ఏదేదో రాసుకొచ్చారు.
వాస్తవానికి, ప్రజల ప్రశ్నలు ఇవి కావు? ఏపీ డాటా చోరీ అయితే… ఆ కేసు తెలంగాణలో ఎందుకు నమోదు అవుతుంది..? ఓటర్ల జాబితాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా. అందులో రహస్యమేముంటుంది..? ఇంతకీ… నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి ఏం చెప్పారు… ఫామ్ 7 పేరుతో వచ్చినవాటిలో తొంభైయేడు శాతానికిపైగా నకిలీ దరఖాస్తులన్నారు. తామే ఆ దరఖాస్తులు ఇచ్చామని జగన్ మొన్ననే చెప్పారు. దీంతో ఎన్నికల సంఘాన్నీ, ప్రజలనీ, ప్రభుత్వాన్నీ తప్పుదోవపట్టించింది ఎవరనేది తేలిపోయింది. ఈ వాస్తవంపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండాలంటే… దొంగే దొంగా దొంగా అని ముందే అరవాలి! సాక్షి ప్రయత్నం ఇదే. జరిగిన దొంగతనమేంటి, దాని వల్ల జరిగిన నష్టమేంటి, ప్రభుత్వం ప్రజల వివరాలను దొంగిలించడమేంటి… ఇవీ ప్రజలకు ఉన్న ప్రశ్నలు. కానీ, సాక్షి దృష్టికి.. ఎంతసేపూ ముఖ్యమంత్రే తప్పు, ప్రభుత్వానిదే తప్పు… ఇవే కనిపిస్తాయి. తాము ఏదనుకుంటే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని సాక్షి భావిస్తున్నట్టుంది. అందుకే, ముఖ్యమంత్రిదే తప్పు అన్నట్టుగా ప్రజల తరఫున తీర్పు చెప్పేస్తోంది.