ఒక లక్ష్యం కోసం ఆందోళన చేయడం, ఉద్యమించడం మన దేశంలో కొత్త కాదు. రిజర్వేషన్ల కోసమే కాదు, ఇంకా అనేక డిమాండ్లను సాధించుకోవడానికి అనేక ఉద్యమాలు జరిగాయి. ఒక్కసారి వాస్తవాలను గమనిస్తే, శాంతియుతంగా జరిగిన ఉద్యమాలే విజయం సాధించాయి. హింసాత్మకంగా, లేదా వేర్పాటు వాదంగా మారిన ఉద్యమాలు సఫలం కాలేదు.
బీసీ రిజర్వేషన్ల కోసం కాపులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. తునిలో భారీ సభను ఏర్పాటు చేశారు. అయితే, ఉద్యమం మొదటి రోజే హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను హటాత్తుగా ఎందుకు తగలబెట్టారనేది ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులను చితక బాదడం, పోలీస్ స్టేషన్లపై దాడి, వాహనాలకు నిప్పు పెట్టడం, యధేచ్ఛగా దుకాణాలపై దాడులు చేయడం ఉద్యమకారులు చేసే పనికాదు. కచ్చితంగా దీని వెనుక సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉండి తీరుతుంది.
చేసింది నిజంగా కాపు ఉద్యమకారులా లేక సంఘవిద్రోహ శక్తులా అనేది తర్వాతి సంగతి. ఉద్యమ నిర్వాహకులు విద్రోహుల పట్ల అప్రతమత్తంగా ఉండాల్సిన బాధ్యతను తప్పించుకోలేదరు. ఎవరో చేశారు మాకు సంబంధం లేదనడం సరికాదు. తమ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండేలా చూసుకోవడంతో పాటు, రౌడీ మూకలు తమ పేరుతో హింసకు పాల్పడకుండా అలర్ట్ గా ఉండటం కూడా ఉద్యమ నాయకుల బాధ్యత.
తునిలో అదే లోపించింది. సాక్షాత్తూ ఉద్యమ నాయకులే రైలు పట్టాలపైకి రావడం, రైలుపై దాడిలో పాల్గొనడంతో పోలీస్ స్టేషన్లపై దాడితో సహా యధేచ్ఛగా విధ్వంసకాండకు పాల్పడ్డ అల్లరి మూకలకు అడ్డు లేకుండా పోయింది.
[pullquote position=”left”]చేసింది ఎవరైనా ఈ ఘటనలు కాపు ఉద్యమంలో మాయని మచ్చగా మిగిలిపోతాయి[/pullquote]
రిజర్వేషన్ల కోసం దూకుడుగా ఉద్యమం చేసిన గుజ్జర్లు రోజుల తరబడి రైళ్లను ఆపారు. హైవేలను దిగ్బంధించారు. కానీ ఇలా రౌడీ మూకల్లా వారూ ప్రవర్తించలేదు. వారి పేరుతో రౌడీ మూకలు హింసకు పాల్పడే అవకాశం ఇవ్వలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో దశాబ్దం పైగా జరిగిన ఉద్యమంలో ఎన్నడూ ఇలాంటి విధ్వంసం జరగలేదు. హైవేలను దిగ్బంధించారు. ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. కానీ హింస, విధ్వంసానికి పాల్పడ లేదు. అసాంఘిక శక్తులు ఆ పని చేసే అవకాశం ఇవ్వకుండా కూడా జాగ్రత్త పడ్డారు.
ఇటీవల పటేల్ ఉద్యమం భిన్నంగా సాగింది. భారీ బహిరంగ సభ జరిగిన నాడే హింస చెలరేగింది. పోలీసుల వైఖరిమీదా ఆరోపణలు వచ్చాయి. అయితే, పదే పదే రాజ్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు, నినాదాలు చేయడం ద్వారా దేశ ద్రోహం కేసును ఎదుర్కొనే పరిస్థితిని ఉద్యమ నాయకులు స్వయంగా తెచ్చుకున్నారు. దీంతో పలువురు జైలు పాలయ్యారు. పర్యవసానంగా, ఉద్యమానికి కొంత కాలంగా బ్రేక్ పడింది. పటేల్ ఉద్యమకారులు దేశ ద్రోహానికి పాల్పడ్డారనే పోలీసుల అభియోగాన్ని కోర్టు కూడా సమర్థించింది. దుందుడుకుగా వ్యవహరిస్తే ఉద్యమాలు తప్పుదారి పడతాయనడానికి ఇది ఒక ఉదాహరణ.
కాపులకు ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన అనుభవశాలి. కాపుల కోసం ఎంతో కాలంగా ఉద్యమిస్తున్న నాయకుడు. కాపులకు రిజర్వేషన్లు కావాలనేది వారి డిమాండ్ అది కొందరికి సబబు అనిపించక పోవచ్చు. అయితే, శాంతియుతంగా జరిగితేనే ఉద్యమం సఫలం అవుతుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులనే పారదోలి మనం స్వాతంత్ర్య తెచ్చుకున్నది శాంతియుద ఉద్యమం ద్వారానే. కాపు నేతలు ఈ విషయం గుర్తంచుకోవాలి. ఇకముందు అణుమాత్రం హింస జరగకుండా పూర్తి శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. లక్ష్యాన్ని సాధించాలంటే అదే సరైన మార్గం.