జనసేన అధినేత పవన్ కల్యాణ్… రైతులకు ఓ వరం ఇచ్చారు. రైతు బంధు తరహాలో ఓ పథకం ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. ఎనిమిది వేల చొప్పున రైతలకు అందజేస్తానని ప్రకటించారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో “వీర మహిళ” నిర్వహించ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ పథకాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14న ప్రకటిద్దామని అనుకున్నానని.. అయితే, మహిళా దినోత్సవం రోజున ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ ప్రకటన చేశానని ప్రకటించారు. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ అని డైలాగ్ చెప్పే పవన్ కల్యాణ్.. సంక్షేమ పథకాల పేరుతో.. ఉచిత పథకాలను కూడా హోరెత్తిస్తున్నారు.
ఇప్పటికే ఉచిత సిలిండర్లు సహా.. అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. తాజాగా.. రైతులకు ఎకరానికి రూ. ఎనిమిది వేల సాయం ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు.,. రైతు బంధు పథకం.. భారీ స్థాయిలో ఓట్లు తెచ్చి పెట్టిందని ప్రచారం జరగడంతో.. ఆ పథకంపై.. పార్టీలు దృష్టి పెట్టాయి. రైతులకు నేరుగా.. నగదు బదిలీ చేసే పథకాలను ప్రవేశ పెట్టాయి. కేంద్రం కూడా కిసాన్ సమ్మాన్ పథకంతో.. నేరుగా.. రైతులకు డబ్బులు జమ చేస్తోంది. విడిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిలో ఉన్నాయి. ఏపీలో… టీడీపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పేరుతో.. ఇప్పటికే పథకం ప్రారంభించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇలాంటి పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. ఆ జాబితాలో ఇప్పుడు పవన్ కల్యాణ్ చేరారు. మొత్తానికి పవన్ కల్యాణ్ కూడా.. సంక్షేమ పథకాల విషయంలో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీల్లాగే.. ప్రకటనలు చేస్తున్నారు.