ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో పిలుపు ఇచ్చిన కాపు గర్జన చాలా చిత్రమైన నేపథ్యంలో ప్రాణం పోసుకున్న ఉద్యమంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక డిమాండుకు సంబంధించి ప్రభుత్వ పరంగా కసరత్తు మొదలైన తర్వాత.. కనీస వ్యవధి కూడా గడవక ముందే ఆ డిమాండును వెంటనే నెరవేర్చాలంటూ భారీ ఎత్తున ఉద్యమం ప్రారంభం కావడం అనేది చిత్రమైన పరిణామం.
అయితే తునిలో కాపుగర్జన సదస్సు హింసాత్మకంగా మారిన తర్వాత రకరకాల అనుమానాలు పొడసూపుతున్నాయి. నిజానికి ఈ గర్జనను కాకినాడలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే సభ జరిగే వేదికను తునికి మార్చారు. కాపుగర్జనను కేవలం భారీ బహిరంగ సభగా మాత్రమే ప్రకటించారు గానీ.. తునికి మార్చడం వెనుక అసలు ఉద్దేశాలు ఇలాంటి ఆందోళనకు తెరతీయడమే అని ఇప్పుడు అనుమానాలు పొడసూపుతున్నాయి. తునిలో అయితే రైలు జాతీయ మార్గాలను స్తంభింపజేయడమూ, నేషనల్ హైవేలను స్తంభింపజేయడమూ సాధ్యం అవుతుందని, తద్వారా దేశవ్యాప్తంగా అందరి చూపును తమ ఉద్యమంవైపు ఆకట్టు కోవడం సాధ్యం అవుతుందని ఆందోళన కారులు భావించినట్లుగా కనిపిస్తోంది.
ప్రసంగం పూర్తి కాగానే ముద్రగడ పద్మనాభం ఇలా మాటలు చెప్పుకోవడం వల్ల ఉపన్యాసాల వల్ల లాభం లేదని, ఆందోళన తర్వాతి దశకు వెళ్లవలసి ఉన్నదని, తాను వెళ్లి రైలు పట్టాల మీద పడుకుంటానని వెళ్లడంతోనే సమస్య ముదిరింది. నాయకుడి ఉవాచ ఆ దిశగా ఉండడంతో గర్జనకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. రైలును, వాహనాలను తగులపెట్టారు. పోలీసుల మీద రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. సభ ముగిసే వేళకు ఆ పోరాటాన్ని రైలు పట్టాల మీదకు తీసుకు వెళ్లడాన్ని గమనిస్తోంటే ఉద్యమానికి ఈ రూపం ఇవ్వాలని ముందుగా స్కెచ్ వేసుకునే కాకినాడలో జరగవలసిన సమావేశాన్ని తునికి మార్చారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అన్నిటినీ మించి తునిలో సభకు కాపు నాయకులు, కులస్తులు అందరూ సమీకరణ అవుతూ ఉంటే వారి సభ, ఉద్యమం, పోరాటం ఎలా జరగబోతున్నదో ఎలాంటి వ్యూహంతో ఉన్నారో పసిగట్టడంలో పోలీసు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా తప్పకుండా ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నదే ఇలాంటి తెరవెనుక జరుగుతున్న సంగతులను ఆరా తీసి తదనుగుణంగా ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను అప్రమత్తం చేయడానికి. అయితే ఇంటెలిజెన్స్ వారు దారుణంగా ఫెయిల్ కావడంతో ఈ ఉద్యమం గాడి తప్పిందని అంతా అనుకుంటున్నారు