డాటా చోరీ వివాదం చివరికి వైకాపాకి తలనొప్పిగా మారుతోంది. ఆ ఉచ్చులో వైకాపా అన్నివైపుల నుంచి బలంగా ఇరుక్కుంటోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. జాబితా నుంచి ఓటర్లను తొలగించేందుకు తామే ఫామ్ 7 పెట్టించామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతోనే ఓటర్ల జాబితాలో తొలగింపుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది ఎవరనేది బయటపడింది. అయితే, తాజా డాటా చోరీ వ్యవహారం తెలంగాణ వేదికగా జరగడం కూడా వైకాపాకి రాజకీయంగా మరింత ఇబ్బందికరంగానే మారుతోంది. ఎలా చూసుకున్నా మైలేజ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. డాటా చోరీ వ్యవహారం నేపథ్యంలో వైకాపా, తెరాసల మధ్య స్నేహం మరింతగా బయటపడ్డట్టు అవుతోంది. నిజానికి, ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని రహస్య స్నేహంగానే ఉంచాలని వైకాపా భావించింది. కానీ, ఇప్పుడు అది కుదరడం లేదు!
ఆ మధ్య, జగన్ తో హైదరాబాద్ లో కేటీఆర్ భేటీ అయ్యాక… ఆంధ్రాలో వైకాపా తీరుపై వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ ప్రభావంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ ల మధ్య జరగాల్సిన భేటీ వాయిదా పడింది. కేసీఆర్ ఏపీ టూర్ కూడా వాయిదా పడింది. తెరాసతో అంత ఓపెన్ గా స్నేహాన్ని కొనసాగిస్తే ఏపీలో వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నట్టు గ్రహించారు కాబట్టే, కాస్త వెనక్కి తగ్గారు. అయితే, తాజా డాటా చోరీ వ్యవహారంతో కేసీఆర్ తో జగన్ కి ఉన్న బంధం మరింత బలపడిందనే అభిప్రాయం కలుగుతోంది. అధికార పార్టీ టీడీపీ కూడా ఇదే కోణాన్ని ప్రజల్లోకి ప్రముఖంగా తీసుకెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో పొరపాటున వైకాపాకి ఎవరైనా ఓటేసినట్టయితే, కేసీఆర్ కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా వ్యాఖ్యానించారు. వైకాపా అభ్యర్థుల జాబితా కూడా హైదరాబాద్ లో తయారు చేసుకుని, ఆంధ్రాలో ఓట్లు అడుగుతారన్నారు. ఏపీని సామంత రాజ్యంగా చేసుకోవడం కోసం కేసీఆర్ పెట్టుబడులు పెడుతున్నారనీ, దీని కోసం ఏపీలో జగన్ ను నియమించుకున్నారని ఆరోపించారు.
ఈరోజే కాదు, గడచిన రెండ్రోజులుగా ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, జగన్, కేసీఆర్ ల మధ్య బంధం ఎంత బలంగా ఉందో ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఈ ప్రచారం వైకాపాకి కచ్చితంగా మైనస్ అవుతుంది. డాటా వ్యవహారమే తలనొప్పి అనుకుంటే, ఈ క్రమంలో రిటర్న్ గిఫ్టులు ఇస్తామంటూ ఛాలెంజ్ చేసిన కేసీఆర్ తో వైకాపా బంధం చాలా బలంగా ఉందనే అంశమూ ప్రజల్లోకి వెళ్తోంది. తెరాసతో మిత్రబంధాన్ని తెరచాటుగా ఉంచాలని వైకాపా అనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపాకి మరింత నష్టం చేకూర్చే అంశంగా మారుతోంది. డాటా చౌర్యంపై టీడీపీ మీద తిప్పికొట్టే విమర్శలు మాత్రమే వైకాపా నేతలు చేస్తున్నారుగానీ, ఈ సందర్భంలో తెరాసతో తమకు ఎలాంటి మిలాకత్ లేదని గట్టిగా చెప్పలేకపోతున్నారు.