మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మళ్లీ వైకాపాలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు! ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసం తనకి ఉందన్నారు. పాదయాత్రతో ప్రజల సమస్యల్ని జగన్ బాగా తెలుసుకున్నారనీ, నాయకుడిగా ఆయన పరిపూర్ణత సాధించారంటూ మెచ్చుకున్నారు. సుపరిపాలన ఇస్తారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి అధికారమిచ్చారనీ, కానీ ప్రజల ఆశల్ని ఆయన ఒమ్ము చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ఈ మధ్య జతకడుతున్నారనీ, ఏ క్షణమైనా ఆ పార్టీలో టీడీపీని విలీనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని దాడి విమర్శించారు.
వాస్తవానికి, దాడి వీరభద్రరావు గత నాలుగున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికలకి ముందే ఆయన వైకాపాలో చేరారు. ఎన్నికలు పూర్తయ్యాక… జగన్ తీరు నచ్చడం లేదనీ, పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న కారణాలు చూపుతూ వైకాపా నుంచి బయటకి వచ్చేశారు. మరి, ఇప్పుడు వైకాపాలో కొత్తగా ఏ ప్రాధాన్యత దక్కుతుందని ఆయన తిరిగి వెళ్లినట్టు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతుంది. అయితే, టీడీపీలో ఒక వెలుగు వెలిగిన దాడి, ఇప్పుడు వైకాపాలో తిరిగి చేరడానికి దారి తీసిన పరిస్థితులు వేరు! చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి టీడీపీలో చేరే ప్రయత్నాలూ దాడి చేశారు. కానీ, పార్టీ అధినాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే… కొణతాల రామకృష్ణకు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే కథనాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీలో దాడికి అవకాశం లేకుండా పోయింది.
దాడిని వైకాపా వైపు అడుగులు వేయించిన మరో కారణం… ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు అని కూడా చెప్పొకోవచ్చు. ఇదే ఉద్దేశంతో ఈ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా దాడి కలిశారు. సామాజిక సమీకరణల లెక్కల ప్రకారం చూసుకుంటే దాడిని చేర్చుకునే అవకాశం జనసేనలో ఉందనే ప్రచారమూ జరిగింది. అయితే, జనసేనాని నుంచి కూడా సరైన సంకేతాలు రాకపోవడంతో… ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే, చివరికి సొంత గూటికే చేరా అంటూ వైకాపాలోకి వచ్చారు. ప్రాధాన్యత దక్కలేదంటూ గతంలో విమర్శలు చేసిన వెళ్లిన దాడికి… ఇప్పుడు వైకాపా ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.