కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమె ఈ రోజు… మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో… మంత్రి కేటీఆర్, కవితలతో సమావేశం అయ్యారు. కొద్ది రోజుల నుంచి సబితా ఇంద్రారెడ్డి కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆమెకు మంత్రి పదవి… ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ సీటు ఆఫర్ చేస్తున్నారు. అయితే.. ఇంత వరకూ సబితా రెడ్డి ఎటూ తేల్చుకోలేదు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తూండటంతో.. అభ్యర్థులను ఖరారు చేస్తూండటంతో.. టీఆర్ఎస్ ఒత్తిడి పెరిగింది. చివరికి ఆమె కుమారుడికి లోక్సభ టిక్కెట్ కోసం… టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చేవేళ్ల నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు అక్కడ గట్టిగా పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం.. టీఆర్ఎస్ అన్వేషిస్తోంది. స్వామిగౌడ్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సహా.. అనేక మంది పేర్లను పరిశీలించారు. చివరికి గడ్డం రంజిత్ రెడ్డి అనే పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చింది. అయితే…చేవేళ్ల నియోజకవర్గంలో ఇప్పటికీ .. పట్లోళ్ల ఇంద్రారెడ్డి అంటే అభిమానులు ఉన్నారని.. ఆయన అభిమానంతో.. కార్తీక్ రెడ్డి సునాయసంగా గెలుస్తారన్న అంచనాలున్నాయి. అందుకే… టీఆర్ఎస్.. కార్తీక్ రెడ్డిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సబితా ఇంద్రారెడ్డి.. రాహుల్ గాంధీ సభకు కూడా వెళ్లారు. ఆ సభలో ఆమె టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ఇంతలోనే… ఆ పార్టీలో చేరే విషయంలో క్లారిటీకి వచ్చారు. ఇప్పటికే.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరు ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో టీఆర్ఎస్లో చేరుతామని.. అవసరం అయితే.. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని చెబుతున్నారు. వీరి జాబితాలో సబితా ఇంద్రారెడ్డి కూడా చేరే అవకాశం కనిపిస్తోంది.