ఎన్నికల తేదీలు వెల్లడైన దగ్గర్నుంచీ అన్ని పార్టీల్లోనూ హడావుడి సహజం. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తును దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. అధికారికంగా జాబితాలను ప్రకటించడమే ఆలస్యం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూడా అన్ని చోట్లా పోటీకి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో భాజపా పరిస్థితిపై ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఓ ఛానెల్ తో మాట్లాడారు. ఎన్నికలకు సంసిద్ధం కావడంలో అందరికంటే తామే చాలా ముందున్నామన్నారు! ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి రాష్ట్రస్థాయి కార్యనిర్వహక సభ్యులతో సమావేశాలు పూర్తి చేసుకున్నామన్నారు. అందరికంటే ముందుగానే ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏ కార్యాచరణతో అయితే ముందుకు వెళ్లాలని అనుకున్నామో, అందరికంటే ముందుగానే సమాయత్తమయ్యామన్నారు!
ప్రధాని మోడీకి విశ్వస్థాయిలో ఉన్న ఖ్యాతి, గత కొద్ది నెలల్లో తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాల వల్ల భాజపా గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయిందన్నారు జీవీఎల్. భాజపా జయించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రా చేరడానికి ఈ ఎన్నికలు నాంది పలుకుతాయన్నారు. ఇక, రొటీన్ గా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ.. బాబు బాగా బుక్ అయ్యారనీ, ప్రజల సొమ్ము దొంగిలించడంతోపాటు ప్రజల డాటాను కూడా దొంగతనం చేశారనే ఆరోపణల్లో చిక్కుకున్నారన్నారు. ఆయనకి ఓటమి అనే భయం పట్టుకుందన్నారు. టీడీపీని చూసి ప్రజలు మోసపోయేది లేదనీ, అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీకి అవకాశం ఇవ్వాలని ఆంధ్రా ప్రజలు అనుకుంటున్నారని జీవీఎల్ చెప్పారు! అవినీతి లేని పాలన అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
అందరికంటే ముందుగా ఎన్నికలకు సిద్ధపడ్డామని జీవీఎల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది! ఎందుకంటే, ఏపీలో భాజపా ఎన్నికలకు సమాయత్తం అవుతోందా లేదా అనే చర్చకు ప్రజల్లో ప్రాధాన్యత ఉందా అనేదే ప్రశ్న? ఏపీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందనీ, అభ్యర్థులు ఎవరుంటారనీ, ఎవరితో పొత్తు అనీ, ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ ప్రభావం ఉంటుందనే చర్చ ప్రముఖంగా ప్రజల్లో లేనే లేదు. ఆ దిశగా భాజపా రాష్ట్ర నాయకత్వం కూడా ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రయత్నించిందీ లేదు. ఎంతసేపూ కేంద్రాన్ని వెనకేసుకుని రావడం, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. అలాంటప్పుడు, భాజపా విజయానికి ఆంధ్రాలో నాంది సాధ్యమా..? బహుశా, జీవీఎల్ తప్ప.. ఏపీ భాజపా నేతలు ఎవరూ ఇంత ధీమాగా ఆ పార్టీ గురించి మాట్లాడలేరేమో!