ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా నెల రోజుల్లో రెండు రాష్ట్రాలలోను సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల తేదీల విషయంలో, బీజేపీ తో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండ్ర వెంకట రమణా రెడ్డి ఆరోపించారు.
టీవీ డిబేట్ లలో ఎన్నికల తేదీ విషయంలో ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అన్న అంశం మీద చర్చ జరిగింది. బీజేపీ ఉనికి ఉన్న మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో విడతల వారీగా ఎన్నికలు జరుగుతుంటే, బీజేపీ ఉనికి లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్నది ఒక ప్రశ్న అయితే, ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలోనే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలను చేర్చడం వెనక కారణాలు ఏంటి అనేది రెండవ ప్రశ్న. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు మూడవ విడతలో కానీ, ఆ తర్వాత కానీ జరుగుతూ ఉండేవి. అయితే ఈసారి ముందుగానే చేర్చడం వెనుక కారణాలు ఏంటి అన్న ప్రశ్న చర్చకు వచ్చింది. అలాగే ఎన్నికల సంఘం లాంటివి ఎంత రాజ్యాంగ బద్ధ సంస్థలు అయినప్పటికీ , భారత దేశంలో అలాంటి సంస్థల మీద కూడా రాజకీయ జోక్యం ఉంటుంది అన్నది ఒక అభిప్రాయం. ఈ నేపథ్యంలో, ఎన్నికల తేదీల వెనుక ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అన్న అంశంపై, గండ్ర వెంకట రమణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద బీజేపీ వైపు నుండి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఒకే విడతలో.. అదీ మొదటి విడతలో చేర్చారని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఇవన్నీ ఊహాగానాలే అని, ఎన్నికల తేదీలు రెండు మూడు వారాలు అటు ఇటు అయినంత మాత్రాన ఫలితాలలో పెద్ద తేడా ఏమీ ఉండదని ఖండించినప్పటికీ, ప్రజల్లో మాత్రం గండ్ర వ్యక్తం చేసినట్టు వంటి అనుమానాలే ఉన్నాయి. కేసీఆర్, జగన్ లు ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా బీజేపీకి ప్లాన్ బి లా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం విస్తృతంగా నెలకొంది. ఎన్నికల అనంతరం కేసీఆర్, జగన్ లు మాత్రమే భాగస్వాములుగా ఉన్న ఈ ఫెడరల్ ఫ్రంట్ కచ్చితంగా మోడీ కే మద్దతు ఇస్తుందని కూడా ప్రజల్లో దాదాపు నిశ్చిత అభిప్రాయం ఉంది.
దీంతో, ఒక వేళ ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ రాజకీయ ఒత్తిళ్లు గనక ఏవైనా ఉండి ఉంటే, కచ్చితంగా ఆ సమాచారం ఇటు కేసీఆర్ కి తద్వారా జగన్ కి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కేసీఆర్ కి, ఆంధ్ర లో జగన్ కి కాస్త అనుకూలత ఉండే అవకాశం ఉండడంతో, అలాగే మరి కాస్త ఎక్కువ సమయం ఇస్తే ఆఖరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మరింత బలపడే అవకాశం ఉండడంతో, అలా జరగకుండా ఉండడం కోసం కేసీఆర్, జగన్ లు మోడీ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేసుకున్నారా అన్న అనుమానాలు జనంలో వినిపిస్తున్నాయి. గండ్ర వెంకట రమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రజల్లో ఉన్న అనుమానాలను బలపరిచే విధంగా ఉన్నాయి.
ఏది ఏమైనా, నిజంగా అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైనా ఉన్నట్లయితే ప్రజలకు అది అర్థం కావడానికి పెద్ద సమయం పట్టదు. ఒక వేళ గండ్ర వెంకట రమణా రెడ్డి చెప్పినట్లుగా అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ గనక జరిగి ఉంటే, అది ప్రజలకు అర్థం అయితే , ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటుంది. ఇటువంటి సస్పెన్స్ అన్నింటికి తెరపడాలంటే మే 23 దాకా ఆగక తప్పదు.