ఎన్నికల ప్రకటన వచ్చింది. ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందరి దృష్టి గెలిచేవారేవరు..? అన్న ప్రశ్నపైనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరకి అడ్వాంటేజ్ ఉంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది…?.
2014తో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఎలా మారింది..?
2014లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ తరహా విజయం సాధించిందో.. అలాంటి విజయం సాధించింది. జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా కనురమరుగవుతున్నాయన్న అభిప్రాయం ఏర్పడిన దశలో… బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. అదంతా మోడీ హవా. గెలిచిన తర్వాత మోడీ హవా మరింత బలంగా మారింది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించారు. అయితే.. ఆ తర్వతా పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయారు. హిందీ హార్ట్ ల్యాండ్‌లో పట్టు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటకలో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే.. బీజేపీ పవనాలు ఇప్పుడు డౌన్ అయ్యాయి. అయినప్పటికీ.. మోడీ బలమైన నాయకుడు. రెండు కూటములు ఇప్పుడు బలమైన కూటములు ఉన్నాయి. యూపీఏ, ఎన్డీఏ. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చరిత్రలో అతి తక్కువ సీట్లలో గెలిచింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ ఐదేళ్లలో 30 సీట్లకు ఉపఎన్నికలు జరిగితే.. అదనంగా ఒక్కటి గెలవలేదు. 9 సీట్లు కోల్పోయింది. ఉపఎన్నికల్లో ఓడిపోవడం అనేది కీలక పరిణామం. సొంతంగా మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సొంతంగా మెజార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ బలం ఒక పార్టీ పెరిగింది. ఎన్డీఏ నుంచి కొన్ని పార్టీలు వెళ్లిపోయాయి. టీడీపీ, ఆర్ఎన్ఎల్డీ వెళ్లిపోయాయి. కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు వచ్చాయి.
దక్షిణాదిలో దారుణమైన పరిస్థితిలో బీజేపీ…!
దేశవ్యాప్తంగా ఎన్నికల జరుగుతాయి. కానీ.. దేశవ్యాప్తంగా ఒకే తీర్పు ఉండదు. రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు తలపడుతున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనాకు రావాలంటే.. ముందుగా ఉత్తరప్రదేశ్ పరిస్థితి తెలుసుకోవాలి. 80 సీట్లు ఉన్న రాష్ట్రం అది. గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాల్లో గెలిచి, 2 స్థానాల్లో మిత్రపక్షాలనూ గెలిపించారు. అక్కడ బీజేపీకి ఎస్పీ, బీఎస్పీ, ఆఎల్డీ కూటమిగా సవాల్ చేస్తున్నాయి. అక్కడ బీజేపీ ఎన్నిసీట్లు వస్తాయో అంచనా వేయలేం. మరో కీలకమైన రాష్ట్రం తమిళనాడు. యూపీఏకు బాగా అవకాశం ఉన్న రాష్ట్రం తమిళనాడు. అక్కడ 39 సీట్లు ఉన్నాయి. అక్కడ డీఎంకే, కాంగ్రెస్‌కు మంచి అవకాశం ఉంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పరిస్థితి మారిపోయింది. తమిళనాడు ప్రజలు ఏదో ఒక కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలుపుతారు. ఇతర రాష్ట్రాల్లో సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండటంతో బెంగాల్‌పై బీజేపీ దృష్టి పెట్టింది. మిషన్ 23 అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. గత ఎన్నికల్లో 34 తృణమూల్, 4 కాంగ్రెస్, రెండు సీపీఐ, రెండు బీజేపీ గెలుచుకుంది. వాజ్‌పేయి హయాంలో.. బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ 23 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈశాన్య భారతాన్ని అల్లకల్లోలం చేసినప్పటికీ.. బెంగాలీలను ఆకట్టుకోవడానికి పౌరసత్వ బిల్లు తెచ్చారు. ఇక నాలుగో కీలకమైన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు. రెండు సార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కారణం అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంత బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలో.. ఢిల్లీలో ప్రభావం చూపిస్తాయి. టీఆర్ఎస్, వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తే బీజేపీకి… అక్కడ టీడీపీ గెలిస్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో 25 సీట్లు ఉన్నాయి. బీజేపీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ.. పౌరసత్వ బిల్లుతో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక పంజాబ్‌లో.. బీజేపీ బలంగా లేదు. ఇతర చోట్లా పరిస్థితి అలాగే ఉంది.
హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ఇంకా గత ఎన్నికల నాటి పట్టు ఉందా..?
హిందీ హార్ట్‌ల్యాండ్‌లో బీజేపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 73 స్థానాలను గెలుచుకుంది. ఉపఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పుడు యూపీలో బీజేపీ ఎదురీదుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. యూపీలోనే బీజేపీ.. 40 నుంచి 50 సీట్లు కోల్పోతుంది. అంటే… ఒడిషా, నార్త్ ఈస్ట్‌లో గెలుచుకున్న వాటితో పోలిస్తే.. రెట్టింపు యూపీలో పోతాయి. ఇక గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్‌లలో బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గుజరాత్లో వెనుకబడిపోయింది. ఢిల్లీలో ఓడిపోయింది. ఈ సారి ఆయా రాష్ట్రాల్లో కనీసం సగం సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే జార్ఘండ్, ఉత్తరాఖండ్..లలోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో గెలిచిన వాటిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి రాజస్థాన్, మధ్య ప్రదేశ్లలో కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ -జేడీఎస్ లు కలసి పోటీ చేస్తే… సింగిల్ డిజిట్ సీట్లకే పడిపోయింది. ఇప్పుడు అక్కడ బీజేపీకి 17మంది ఎంపీలున్నారు. ఇక మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనతో కలిసి గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పరిస్థితి బాగా లేదు. విడివిడిగా పోటీ చేస్తామంటున్నారు. కలసి పోటీ చేసినా.. విడిపోయి పోటీ చేసినా.. ఇప్పుడు ఉన్న సీట్లు రావడం కూడా కష్టమే.
మిత్రుల్ని ఎవరు బాగా దగ్గర చేసుకుంటారు..? ఎవరి వైపు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఆకర్షితులవుతాయి.. అన్నది అత్యంత కీలకమైన అంశంగా కనిపిస్తోంది.