ఎన్నికల ప్రకటన వచ్చేసింది. మరో వారంలో నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో ఏడు గెలిచిన తెలుగుదేశం పార్టీ చాలా ముందుగానే ఎన్నికల సన్నాహాలు చేసింది. పలువురు వైసీపీ నేతల్ని పార్టీలో చేర్చుకుంది. అభ్యర్థుల్ని కూడా దాదాపుగా ఖరారు చేశారు. అధికారిక ప్రకటన మాత్రమే చేయాల్సి ఉంది. ఎచ్చెర్ల నుంచి కళా వెంకటరావు, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్, పలాస నుంచి ఎమ్మెల్యే శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష, రాజాం నుంచి కోండ్రు మురళి, శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే లక్ష్మీదేవి, ఆముదాల వలసలో కూన రవికుమార్, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి పేర్లును ఖరారు చేశారు. వీరు ప్రచారబరిలో దిగారు కూడా., ఇక పాతపట్నంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కలమట వెంకటరమణ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో.. రెండు, మూడురోజుల్లో ఫైనల్ చేయనున్నారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు ప్రచారం కూడా ప్రారంభించారు. ఐదేళ్లలో ఆయన పనితీరు, మాట తీరుతో ప్రజలను మెప్పించారు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డొలాయమానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎవరికీ టిక్కెట్ ఇస్తానని గ్యారంటీగా చెప్పలేదు. చివరికి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా గాల్లో దీపంలా ఉండటం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వెల్లడిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అతి కష్టం మీద మూడు స్థానాలను గెలుచుకుంది. ఈ సారి ఆ మూడు స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే చాలా కాలం కిందటే… అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు వారంతా రంగంలో ఉన్నారు. ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. ఫలానా నియోజకవర్గంలో వైసీపీ తరపున ఫలానా నేత పోటీ చేస్తాడన్న క్లారిటీ అసలు లేరు. అసలు గ్రూపుల గొడవల్లో.. వైసీపీలో ఇటీవల కిల్లి కృపారాణి చేరిక.. మొత్తానికే తేడా తెచ్చి పెట్టింది. ధర్మాన వర్గం టెక్కలి, పలాస, ఇఛ్చాపురం, శ్రీకాకుళం నియోజకవర్గాలలో తన మాటవినని వైసీపీ నేతలకు పొమ్మనలేక పొగపెట్టారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనుకు మంచి పట్టున్నప్పటికీ పేరాడ తిలక్ ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు జగన్ వ్యూహాత్మకంగా కృపారాణిని తెచ్చారు. ఆమె మాజీ కేంద్రమంత్రి అయినప్పటికీ.. పార్లమెంట్ సీటుపై ఆశలు పెట్టుకోవడం లేదు. అందుకే టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఆమె పోటీ చేస్తే ధర్మాన సహకరించే పరిస్థితులు లేవు. ధర్మాన వర్గం ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. వారిని టిక్కెట్ల విషయంమలో పరిగణనలోకి తీసుకోకపోతే అభ్యర్థులకు సహకరించే పరిస్థితి లేదు. అందుకే ధర్మానను ఎంపీగా నిలబెట్టాలనే ఆలోచన జగన్ చేస్తున్నారని..వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన తరవాత కానీ.. వైసీపీ అసలు పరిస్థితిని శ్రీకాకుళంలో అంచనా వేయడం కష్టం.
ఇక… జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఉద్దానం కోసం పోరాడానని పవన్ కల్యాణ్ ఎంతగా ప్రచారం చేసుకున్నా… గట్టిగా జనాల్లో గుర్తింపు ఉన్న ఒక్కరంటే ఒక్క నేతను కూడా చేర్చుకోలేకపోయారు. పోరాటయాత్ర అక్కడ్నుంచే ప్రారంభించినా.. కొంత మంది వైసీపీ, టీడీపీల్లోని ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. వారెవరికీ పెద్దగా గుర్తింపు లేదు. ఎరైనా పవన్ ఇమేజ్ మీద ఆధారపడాల్సిందే. అయితే.. టిక్కెట్ల ఖరారు కోసం ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ఎవరికైనా టిక్కెట్లు ఇవ్వవచ్చు. కానీ.. ఎంత మంది నామినేషన్లు వేసిన తర్వాత పార్టీ కోసం నిలబడతారన్నది కీలకంగా మారింది. ఇక బీజేపీ పరిస్థితి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు.. సిక్కోలులో ఆ పార్టీ పోటీ చేస్తుందో లేదో అంచనా వేయడం కష్టమే. పలాసలో అమిత్ షా పర్యటనకు..సెక్యూరిటీగా వచ్చిన పోలుసులంత మంది జనం కూడా రాకపోవడంతో… ఆ పార్టీ పరిస్థితి అప్పుడే తేలిపోయింది.