ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గ్రామగ్రామాన క్యాడర్ ఉన్న పార్టీలు.. బలమైన అభ్యర్థుల కోసం తంటాలు పడుతున్నాయి. అలాంటిది బీజేపీకి అభ్యర్థులు దొరకడం అనేది అసంభవం. పార్లమెంట్ అభ్యర్థులే దొరకరు.. ఇక అసెంబ్లీ అభ్యర్థులు ఎలా అన్నది.. ఆ పార్టీకి పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. మొదటి విడతలోనే ఎన్నికలు ఉంటాయని…ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కూడా సమాచారం ఇవ్వలేదు. దాంతో వారు అభ్యర్థులపై పెద్దగా కసరత్తు చేయలేదు. ఇప్పుడు.. ఎవర్ని ఎక్కడ నిలబెట్టాలన్న అంశంపై.. కిందా మీదా పడుతున్నారు.
ఏపీ బీజేపీలో చెప్పుకోవడానికి నోరున్న నేతలు చాలా మంది ఉన్నారు. వారిలో కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు, మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి , గోకరాజు గంగరాజు లాంటి రాష్ట్ర స్థాయి నేతలు… రామ్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు లాంటి జాతీయ స్థాయి నేతలు ఉన్నారు. వీరిలో ఎవరు ఎన్నికల బరిలో నిలబడతారో ఎవరూ క్లారిటీగా చెప్పడం లేదు. చివరికి కన్నా లక్ష్మినారాయణ బరిలో ఉంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయనకు సహకరించడానికి వైసీపీ ముందుకొచ్చి.. గుంటూరు పశ్చిమలో వీక్ క్యాండిటేట్ను పెట్టినా బీజేపీ ముద్రపై ఓటు వేయడానికి జనం సిద్ధపడే పరిస్థితి లేదు. అదే సమయంలో.. ఆయనను పార్లమెంట్‌కు పోటీ చేయాలని హైకమాండ్ చెబుతోంది. లోక్‌సభకు పోటీ చేస్తే ఖర్చు తప్ప ఇంకేం మిగలదని ఆయన టెన్షన్ పడుతున్నారు. ఏదో కారణం చెప్పి పోటీకి దూరంగా ఉంటే బెటరని ఆయన ఆలోచిస్తున్నారంటున్నారు. మళ్లీ మోడీ గెలిస్తే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తనకు ఏదో ఓ పదవి వస్తుందని ఆయన అనుకుంటున్నారు.
ఇక టీడీపీతో పొత్తు ఉన్నప్పుడే సోము వీర్రాజు పోటీ చేయడానికి వెనుకాడారు. ఇక ఇప్పుడు పోటీ చేయమంటే ఆయన చేయరు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని సాకుగా చూపి తప్పించుకుంటారు. ఇక ఎవరూ టిక్కెట్లు అడగడం లేదు. టీవీ చర్చల్లో నోరున్న నేత అయిన విష్ణువర్ధన్ రెడ్డి.. అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలో బీజేపీ తరపున పోటీ చేసి… వెయ్యి, రెండు వేల ఓట్లు తెచ్చుకున్న చరిత్ర ఉంది. అయితే.. అప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు.. ఆయన టీవీల పుణ్యమా అని తానో పెద్ద నేతగా తనను తాను ఊహించుకుంటున్నారు. ఈ సమయంలో… తాను పోటీ చేసి.. నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుంటే… అందరి ముందు కురచ అయిపోతానని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి కూడా ఈ సారి పోటీకి వెనుకాడుతున్నారు. ఆమె వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరగడం కొసమెరుపు. అందుకే.. బీజేపీ తరపున ఎవరైనా పోటీకి ముందుకు రావాలంటే.. రామ్‌మాధవ్, జీవీఎల్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి.. ఇతరులకు ధైర్యం ఇవ్వాలని కోరుతున్నారు.