‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో దాదాపుగా 780మంది సభ్యులున్నారు. వాళ్లలో 480మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 300మంది ఓటింగ్‌కి డుమ్మా కొట్టారు. నిన్న జరిగిన ఓటింగ్ సరళిని చూస్తుంటే అసలు ‘మా’ లో హీరోయిన్లు ఉన్నారా? లేదా? అనే అనుమానం వేస్తుంటుంది. సమంత, రకుల్, రాశీఖన్నా, అనుష్క, తమన్నా, కీర్తి సురేష్.. వీళ్లంతా ‘మా’లో సభ్యులుగా ఉన్నారు. నాలుగైదు సినిమాలు చేసిన ప్రతీ కథానాయిక `మా`లో సభ్యురాలే. అలాంటప్పుడు వీళ్లెవరికీ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మంచి మంచి మాటలు చెప్పేవీళ్లు.. ఓటు హక్కు గురించి గొప్పగా చెప్పే వీళ్లు ఓటు వేయడానికి రాలేదంటే.. ఏమనుకోవాలి. సంజన, ప్రియమణి లాంటి ఒకరిద్దరు తప్ప – కథానాయికలెవరూ ఛాంబర్ వరకూ రాలేకపోయారు.
బాలకృష్ణ, వెంకటేష్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, చరణ్, బన్నీ.. ఇలా టాప్ స్టార్స్ సైతం ‘మా’ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ‘మా’ నిధి కోసం స్టార్ హీరోలతో ఓ కార్యక్రమం నిర్వహించాలని ‘మా’ భావిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి రానివాళ్లు ఇక.. నిధి కోసం ముందడుగు వేస్తారా? ‘మా’ సర్వ సభ్య సమావేశాలు ఎప్పుడు జరిగినా ఏ కథానాయిక, ఏ కథానాయకుడు కనిపించరు. ‘మా’ అనేది ఇబ్బందుల్లో ఉన్న పేద కళాకారుల కోసమేనా? వాటి వల్ల మాకెలాంటి ప్రతిఫలం అందండం లేదు కదా? మేమెందుకు అక్కడ కనిపించాలి అనుకుంటున్నారా? – ‘మా’కి ఈ స్టార్లంతా ఇస్తున్న స్థానమేంటో వాళ్లకే తెలియాలి.