విశాఖ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి. ఈ రెండు సీట్లు.. అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమే. అయితే.. రెండు ప్రధాన పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను వెదుక్కుంటున్నాయి. అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి కానీ.. ఎవరికీ ఖరారు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తరపున మొదట… విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం మూర్తి మనవడు శ్రీభరత్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కూడా పోటీకి సిద్ధమని ప్రకటించారు. కానీ.. అక్కడ ఈ సారి సామాజిక కోణంలో.. అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు పేర్లను ప్రధానంగా టీడీపీ పరిశీలిస్తోంది. గంటా అసెంబ్లీకే అని పట్టు బడుతున్నారు. కానీ బలమైన అభ్యర్థి కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు గంటాపైనే ఒత్తిడి పెంచుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ విశాఖ లోక్‌సభ సీటుపై క్లారిటీ లేదు. విశాఖలో ప్రముఖ బిల్డర్, సినీ నిర్మాతగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను పాదయాత్ర సమయంలో పార్టీలో చేర్చుకుని… ఆయనే లోక్‌సభ అభ్యర్థి అని ఆశలు కల్పించారు. నిజానికి ఆ సీటుపై విజయసాయిరెడ్డి ఎప్పుడో కన్నేశారు. చాలా కాలంగా.. అక్కడే మకాం వేసి పని చేశారు. ఆయన దగ్గరి బంధువు.. ఓ ఫార్మా కంపెనీ అధినేతను అక్కడి నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. కానీ జగన్ మరో విధంగా ఆలోచించారు. ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణకు కూడా టిక్కెట్ ఖరారు చేయలేదు. ఇప్పుడు… ఓ బీజేపీ మహిళా నేత వస్తారని.. చివరి క్షణంలో ఆమె నామినేషన్ వేస్తారని చెబుతున్నారు.
అనకాపల్లి లోక్‌సభ సీటు విషయంలోనూ.. రెండు పార్టీల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. అనకాపల్లి రాజకీయాలను శాసించే కొణతాల, దాడి కుటుంబాలు.. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు రావడంతో.. దాడి వైసీపీలో చేరారు. కొణతాల పదిహేడో తేదీన వైసీపీలో చేరుతారని అంటున్నారు. రెండు పార్టీల లోక్‌సభ అభ్యర్థులు.. వీరి నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నారు. అనకాపల్లి లోక్‌సభ టిక్కెట్ కొణతాల రామకృష్ణకు ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. అయితే.. కొణతాల మాత్రం అసెంబ్లీ టిక్కెట్ కోరుతున్నారు. దాడి వీరభద్రరావు కూడా అంతే. తన కుమారుడికి.. అసెంబ్లీ టిక్కెట్ కోరుతున్నారు. జగన్ మాత్రం పార్లమెంట్‌కు పోటీ చేయమంటున్నారు. రెండు పార్టీల్లోనూ… అభ్యర్థులు చివరి వరకూ ఖరారయ్యే పరిస్థితి కనిపించడం లేదు.