” బిడ్డ కడుపున పుట్టినప్పటి నుంచి కాటికెళ్లవరకూ ప్రజల బాగోగులు చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం. సంక్షేమ రాజ్యం మాది..” ఇది.. టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వాసం. బాలింతలకు పౌష్టికాహారం, తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్, అందరికీ రేషన్, పండుగలకు కానుకలు, విద్య, వైద్యం కోసం సాయం, ఉపాధి, ఉద్యోగాల కల్పన, చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా, పింఛన్లు.. ప్రజలకు కూడా.. అలాంటి సేవలు అందాయి. బసవతారకం కిట్లు దగ్గర్నుంచి చంద్రన్న బీమా వరకూ అనేక పథకాలను…ఈ ఐదేళ్లలో ప్రవేశ పెట్టారు. దాదాపుగా లక్ష కోట్లకుపైగానే వ్యయం చేశారు. రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో 70శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చేశారు.
పేదలకు సంక్షేమ భరోసా…!
భారీ లోటు బడ్జెట్తో చంద్రబాబు ఏపీ పగ్గాలు చేపట్టారు. అప్పట్లో కేవలం రూ. 200 మాత్రమే సామాజిక పెన్షన్లు ఉండేవి. ఇప్పుడు అవి రెండు వేలు. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఆయన రూ. రెండు వందల నుంచి.. రూ. రెండు వేలు అందిస్తున్నారు. ధనిక రాష్ట్రాల కంటే అత్యధికంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నవ్యాంధ్రలో అమలుచేస్తున్నారు. రుణమాఫీలకు వెచ్చించిన నగదు కాకుండానే.. .. రూ.లక్ష కోట్లను సంక్షేమంపై ఖర్చు చేశారు. కార్మికుడు ఒకపూట భోజనం చేయాలంటే రూ.50 ఖర్చుచేయాల్సి వచ్చేది. ఇప్పుడు రూ.5కే భోజనం. అందిస్తున్నారు. అన్న క్యాంటీన్లతో శుచిగా, రుచిగా భోజనం పెడుతున్న క్యాంటీన్ దేశంలో అన్న క్యాంటీన్ ఒక్కటే.
చందన్న బీమా … ఓ గొప్ప ఆలోచన..!
రాష్ట్రంలో ఓటర్లు అటూఇటుగా.. నాలుగు కోట్ల మందే. కానీ… ఏపీలో 4.17 కోట్ల మందికి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇవే గాక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు కానుకలిస్తున్నారు. 6.15 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారానికి రెండు గుడ్ల బదులు ఐదు గుడ్లు పెట్టడం ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా చంద్రన్న బీమా అమలుచేస్తున్నారు. ఇంటి యజమాని చనిపోతే దిక్కుతోచని స్థితిలో పడే ప్రమాదం నుంచి తప్పించారు. ప్రమాదం అయినా.. సహజ మరణం అయినా.. బీమా సొమ్ము ఇంటికి రావడం.. అనేది అనేక కుటుంబాల్ని ఆదుకుంది. చనిపోయినట్లు సమాచారం రాగానే… అంత్యక్రియల ఖర్చులకు రూ. 5వేలు తెచ్చి ఇస్తారు. పెద్ద ఖర్మఅయ్యే లోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మిగతా సొమ్ము అకౌంట్లో వేస్తారు.
విద్యార్థుల కోసం…వారి భవిష్యత్ కోసం ఏపీ ప్రభుత్వం తగినంతగా ఖర్చు చేసింది. 34 లక్షల మందికి ఉపకార వేతనాలను గతం కంటే పెంచి ఇస్తున్నారు. విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల వరకు సాయం అందిస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం రుణాలు, సబ్సిడీలు ఇస్తున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా అన్ని రోజులూ పనిదొరికేలా చేస్తున్నారు. కొత్తగా అగ్రకుల పేదల కోసం… కార్పొరేషన్లు పెట్టారు. కాపు, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్లు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను.. కొత్తగా.. వేర్వేరు కులాలకు ఏర్పాటు చేశారు. వాటికి నిధులు పెంచి.. వీటి ద్వారా ప్రతి వర్గం లబ్ధి పొందేలా సాయం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ స్థాపించారు.
ఐదేళ్లలో రూ. లక్షా 20 వేల కోట్ల సంక్షేమం..!
ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం ఐదేళ్లలో సంక్షేమం కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చుచేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.40,254 కోట్లు, ఎస్టీలకు రూ.14,210 కోట్లు, బీసీలకు రూ.39,038 కోట్లు, మైనారిటీలకు రూ.3,215కోట్లు, దివ్యాంగులకు రూ.4,326 కోట్లు ఖర్చుచేశారు. బీసీలకు ఆదరణ-2 పథకం కింద అత్యాధునిక పథకాలు అందిస్తున్నారు. గిరిజన గ్రామ పంచాయతీల్లో నెట్వర్క్ కల్పనకు రూ.90 కోట్లతో గిరినెట్ పథకం. ఎస్టీ కుటుంబాలకు పౌష్టికాహారం కోసం రూ.120.40 కోట్లతో ఫుడ్ బాస్కెట్ పథకాన్ని ప్రవేస పెట్టారు. మన్యంలో ఉండే గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్నారు.