రాజమహేంద్రవరంగా మారిన రాజమండ్రి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడం.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. చివరి క్షణంలో.. తాను పోటీ చేయబోనని… మురళీమోహన్ ప్రకటించారు. ఆయన పోటీ చేయకపోతే.. ఇంత కాలం.. రాజమండ్రి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకున్న ఆయన కోడలు రూపాదేవీ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ.. తన కుటుంబసభ్యులెవరూ.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరని.. ఆయన తేల్చి చెప్పేశారు. దాంతో చంద్రబాబునాయుడుకు… లోక్‌సభ అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఎంపీ అభ్యర్థి అంటే.. అయితే.. కాస్త ఇమేజ్ ఉన్న నాయకుడైనా ఉండాలి.. లేకపోతే.. అసలు ఎవరికీ తెలియని వ్యక్తి అయినా ఉండాలి. నియోజకవర్గ స్థాయి నేతను తీసుకొచ్చి ఎంపీగా పోటీ పెడితే.. ఇబ్బందికరం అవుతుంది. అందుకే చంద్రబాబు రకరకాల కాంబిషన్లు ట్రై చేస్తున్నారు.
రాజమండ్రి ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో నేతలు.. చంద్రబాబును కలుస్తున్నారు. వీరిలో.. పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక కూడా ఉన్నారు. అయితే.. పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన బొడ్డు భాస్కరరామారావు పేరును కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అయితే.. ఆయన గత ఎన్నికలకు ముందు.. వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు.. గత ఎంపీ ఎన్నికల్లో మురళీమోహన్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు కూడా.. తనకు పెద్దాపురం టిక్కెట్ ఇవ్వకపోతే.. వైసీపీలో చేరిపోతానని ఓ రకమైన హెచ్చరికలు కూడా చేశారు. దాంతో… బొడ్డు భాస్కరరామారావు పేరును చంద్రబాబు హోల్డ్‌లో పెట్టారు. ఇతర సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్నారు.
పద్దెనిమిదో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లోపే అభ్యర్థిని ఖరారు చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే.. వివిధ రకాల పేర్లను పరిగణనలోకితీసుకుని .. చంద్రబాబు పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా.. అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. చివరికి.. మురళీమోహన్‌పై ఒత్తిడి పెంచి ఆయన కోడలు రూపాదేవిని బరిలోకి దింపడానికి చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేస్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. మహిళలకు టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉండటమే దీనికి కారణం.