ఆంధ్రప్రదేశ్‌లో .. పరిస్థితి ఎలా ఉందో వెల్లడిస్తున్న జాతీయ మీడియా సర్వేల్లో కాంగ్రెస్‌కు ఈ సారి గౌరవప్రదమైన ఓట్లు లభిస్తున్నాయి. దాదాపుగా ప్రతి సర్వేలోనూ… పది శాతం ఓట్లు కనిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా నినాదంతో..కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. పది శాతంవరకూ ఓటు బ్యాంక్ రావొచ్చని అంచనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎక్కడికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ప్రత్యేకహోదా. నమ్మించిన మోసం చేసిన బీజేపీ మీద.. ఏపీ ప్రజలు కోపంతో ఉన్నారు. రాష్ట్ర విభజనలో సహకరించిన బీజేపీనే అసలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామని చెబుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో కటిఫ్ చెప్పిన టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతుగా నిలబడుతోంది
ప్రత్యేకహోదాకు… లోక్‌సభ సీట్లు అత్యంత కీలకం. ప్రత్యేక హోదా ఇస్తానంటోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం రావడానికి మాత్రమే అవకాశం ఉంది. మరే ఇతర ఆప్షన్ లేదు. బీజేపీ వచ్చినా.. బీజేపీకి ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చే ప్రభుత్వం వచ్చినా… ప్రత్యేకహోదా రాదు. ఎలాగైనా.. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంటే మాత్రమే… ప్రత్యేకహోదా వస్తుంది. ప్రస్తుత సమయంలో..కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే బీజేపీకి మద్దతిస్తామని మాత్రం చెప్పడం లేదు. ప్రత్యేకహోదా ఎవరిస్తామంటే వారికి మద్దతిస్తామని అంటున్నారు. కానీ.. జాతీయ మీడియా మాత్రం.. వైసీపీని బీజేపీ అప్రకటిత మిత్రపక్షం ఖాతాలోవేసి.. ఫలితాలను విశ్లేషిస్తోంది. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకే మద్దతుగా ఉంటారని…. అంటున్నారు. అంటే.. వైసీపీకి వేసే ప్రతి ఓటు.. ఆ పార్టీకి వచ్చే ప్రతి లోక్‌సభ సీటు బీజేపీకి వచ్చినట్లే. అందుకే ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారని అంటున్నారు.
ప్రజల్లోకి ఈ అంశం… వెళ్లడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. బీజేపీతో.. దగ్గరి తనం.. ఆ పార్టీకి ముస్లిత, దళిత, గిరిజన ఓటు బ్యాంకుల్ని దూరం చేసింది. అదే సమయంలో…కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకహోదా నినాదం బూస్ట్‌గా ఉపయోగపడుతోంది. వైసీపీ క్యాడర్ మొత్తం… కొంత కాలం కిందటి వరకు కాంగ్రెస్ క్యాడరే. వారిలో ముస్లిం, దళిత,గిరిజనులే ఎక్కువ. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్‌కు వెళ్లే ప్రతి ఓటు..వైసీపీదేననే అంచనాలుండటమే దీనికి కారణం. గత ఎన్నికల్లో రెండు శాతం ఓట్లతో మాత్రమే ఓడిపోయామని.. వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడా గ్యాప్‌ను కాంగ్రెస్ పార్టీ పెంచుతుందా.. అనే భఆందోళన వైసీపీలో ప్రారంభమయింది.